సిఎం రేవంత్ రెడ్డి నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశమైనప్పుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వ పధకాల అమలుపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టిన్నట్లు చెప్పారు.
ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి బాగోనప్పుడు హడావుడిగా పంట రుణాలు మాఫీ చేయడానికి అన్నివేల కోట్లు ఖర్చు చేయడం అవసరమా? మాఫీ చేసినా ప్రభుత్వానికి విమర్శలు తప్పడం లేదు కదా?అయినా పధకాలను ప్రకటించడం దేనికి?
అమలుచేయలేక అవస్థలు పడటం దేనికి? ప్రభుత్వం ఆర్ధిక పరిస్థితి గురించి ప్రజలకు వివరించి పధకాల అమలుకి మరి కొంత సమయం తీసుకోవచ్చు కదా? గ్రామసభలు పెట్టి దరఖాస్తులు స్వీకరించి, అర్హులను గుర్తించి వారి పేర్లు ప్రకటించిన తర్వాత వారికి ఇళ్ళు కనీసం రేషన్ కార్డులు ఇవ్వకపోతే ఎలా?అటువంటప్పుడు ఇంత హడావుడి చేయడం దేనికి?
రాష్ట్రంలో గుంతలు పడిన రోడ్లకు మరమత్తులు చేయించేందుకే ప్రభుత్వం వద్ద డబ్బు లేనప్పుడు, ఆ పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేకపోతున్నప్పుడు పధకాల గురించి ప్రచారం, అమలుచేస్తామని ప్రకటనలు ఎందుకు?
అయినా ప్రతీ విషయంపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వలననే సమస్యలు, విమర్శలు మరింత పెరుగుతున్నాయి. కనుక ఇకనైనా అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది,” అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిష్కర్షగా చెప్పారు.
నోటితో చెప్పడమే కాకుండా తన అభిప్రాయాలు, సలహాలు, సూచనలు, తన దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలు అన్నిటి గురించి లిఖితపూర్వకంగా సిఎం రేవంత్ రెడ్డికి అందజేస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాదనలు సహేతుకంగానే ఉన్నాయని అర్దమవుతూనే ఉంది. అయితే ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చినందున, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోనప్పటికీ వాటిని అతికష్టం మీద అమలుచేస్తుంటేనే, కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలుచేయకుండా ప్రజలను మోసం చేస్తోందని బిఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది.
బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఈ ప్రచారం వలన కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో వ్యతిరేకత నానాటికీ పెరుగుతూనే ఉంటుంది. కనుక అది పెరగకుండా బ్యాలన్స్ చేసేందుకే హామీలు అమలు చేయాల్సివస్తోంది. కనుక ఎన్నికలలో గెలిచేందుకు ఎడాపెడా హామీలు ప్రకటించడం ఎంత పొరపాటో కాంగ్రెస్ నేతలకు ఈపాటికి అర్దమయ్యే ఉంటుంది. కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు. కనుక ఈ ఆటుపోట్లు భరించక తప్పదు.
ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అప్పులు, ఆర్ధిక విధ్వంసం వలన అక్కడి కూటమి ప్రభుత్వం ఆర్ధిక పరిస్థితి తెలంగాణ కంటే చాలా దయనీయంగా ఉంది. అందువల్లే ఎన్నికల హామీలు అమలుచేయడానికి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఏమాత్రం తొందరపడటం లేదు. హామీల అమలు చేయడం లేదంటూ వైసీపీ ఎంతగా విమర్శిస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదు.
ప్రజలపై అదనపు భారం వేయకుండా ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు చంద్రబాబు నాయుడు దారులు ఆన్వేషిస్తున్నారు. కనుక తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుగా ఆదాయం పెంచుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేయడం చాలా అవసరం. ఎల్లకాలం ఆర్ధిక పరిస్థితి బాగోలేదని చెపుతుంటే ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పట్ల నమ్మకం పోతుంది.