ఉప ఎన్నికలు కోరుకుంటున్నది ఎవరు?

February 06, 2025


img

కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టు పిటిషన్‌ వేయడం, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో వారికి శాసనసభ కార్యదర్శి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

సుప్రీంకోర్టు ఈ కేసుపై రేపు విచారణ చేపట్టబోతోంది గనుక బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తమ న్యాయవాదులతో దీని గురించి మాట్లాడేందుకు నేడు ఢిల్లీ వచ్చారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడుతూ, “ఈ కేసు విచారణని ఇంకా వేగవంతం ఎలా చేయాలో మేము చర్చించుకున్నాము. పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్‌ తక్షణం అనర్హత వేటు వేయాలని, ఆ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు,” అని అన్నారు. 

వారు బిఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి తమకి హ్యాండిచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు కనుక వారిపై అనర్హత వేటు వేయాలని బిఆర్ఎస్ పార్టీ కోరుకోవడం సహజం. అందుకోసం న్యాయపోరాటం చేయడాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. 

కానీ తమ రాజకీయ ఆలోచనలని, కోరికలని ప్రజలకు ఆపాదించి వారు కోరుకుంటున్నారని చెప్పడమే చాలా హాస్యాస్పదంగా ఉంది. పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా, వారిపై అనర్హత వేటు వేసినా వేయకపోయినా, ఉప ఎన్నికలు జరిగినా జరగకపోయినా వాటితో సామాన్య ప్రజలకు ఏం సంబంధం? ఏం నష్టం? 

అయినా గతంలో కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌, టీడీపీ ఎమ్మెల్యేలను బిఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయింపజేసుకున్నారు కదా? అప్పుడు ఆ రెండు పార్టీల నేతలు స్పీకర్‌కి వినతి పత్రాలు ఇస్తే వారిపై చర్యలు తీసుకోలేదు కదా? అప్పుడు తప్పు కానప్పుడు ఇప్పుడు అదే పని కాంగ్రెస్ పార్టీ చేస్తే తప్పేలా అవుతుంది? 

అయినా పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్‌, టీడీపీ నేతలను పక్కనే పెట్టుకొని ఫిరాయింపులు అక్రమం, అన్యాయం అని కేసీఆర్‌ వాదించడం హాస్యాస్పదం కాదా?               


Related Post