దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. కానీ నేటికీ రాష్ట్రం మొత్తానికి ఒకే ఒక విమానాశ్రయం ఉంది. కనుక వరంగల్ మాములూర్ వద్ద ఒకటి, భద్రాద్రి కొత్తగూడెంలో మరొకటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం చాలా కాలంగా కేంద్రాన్ని కోరుతూనే ఉంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య బలమైన సత్సంబంధాలు లేకపోవడంతో ఈ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమైపోయాయి.
సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్, బీజేపి రాజకీయాలు పక్కన పెట్టి ప్రధాని మోడీని కలిసి విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని కోరడంతో వాటిలో కదలిక వచ్చింది. ఇటీవలే ఎయిర్ పాస్‌పోర్టు ఆధారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నుంచి నిపుణుల బృందం భద్రాచలం వచ్చి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి వెళ్ళింది.
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగూడెం జిల్లాలో రామవరం, గరీబ్ పేటలో 707 ఎకరాలు, సుజాతానగర్ మండలంలో 195 ఎకరాలు, చుంచుపల్లి మండలంలో 50 ఎకరాలు కలిపి మొత్తం 950 ఎకరాలు విమానాశ్రయం కొరకు కేటాయించేందుకు సంసిద్దత వ్యక్తం చేసింది. ఆ ప్రాంతాలలోనే ఏఏఐ బృందం అధ్యయనం చేసి కేంద్ర పౌరవిమానయాన శాఖకు తన నివేదిక ఇచ్చింది.
పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహాల్ రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నకు సమాధానమిస్తూ, “భద్రాదిలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ఏర్పాటు కోసం మాపని పూర్తిచేశాము. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వమే చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం, దాని కోసం నిధులు కేటాయించడం తెలంగాణ ప్రభుత్వ బాధ్యతే. ఈ పనులు పూర్తిచేసి మాకు తెలియజేస్తే ఎయిర్ పోర్ట్స్ ఆధారిటీ ఆఫ్ ఇండియా భద్రాద్రిలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపడుతుంది,” అని చెప్పారు. అంటే కేంద్రం సిద్దంగా ఉంది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానిదే ఆలశ్యమనుకోవచ్చు. మరి దీని కోసం పట్టుబడుతున్న తెలంగాణ ప్రభుత్వం ఎప్పటిలోగా ఈ పనులన్నీ పూర్తిచేస్తుందో?