కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ నేతలు కేంద్రాన్ని విమర్శిస్తున్నారు. పనిలో పనిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా హరీష్ రావు విమర్శిస్తున్నారు. ఢిల్లీకి ముప్పైసార్లు వెళ్ళి వచ్చినా రాష్ట్రానికి ఏం సాధించారని హరీష్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు 8 మంది, బీజేపికి మరో 8 మంది ఎంపీలున్నా ఏం ప్రయోజనం అని హరీష్ రావు ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందని బిఆర్ఎస్ నేతలు వాదిస్తే అర్దం చేసుకోవచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఎంపీలను విమర్శించడమే విడ్డూరంగా ఉంది.
ఎందువల్ల అంటే నాడు బిఆర్ఎస్ పార్టీ ఒక్క దానికే 9 మంది ఎంపీలు, పలువురు రాజ్యసభ ఎంపీలు ఉండేవారు. పైగా ఇతర రాష్ట్రాల ఎంపీలు కూడా తమకు మద్దతు ఇచ్చేవారని నిన్ననే కల్వకుంట్ల కవిత చెప్పుకున్నారు. అయినా రాష్ట్రానికి ఏమీ సాధించలేకపోయారు కదా?
రాష్ట్రంలో బీజేపి ఎదుగుదలని అడ్డుకునేందుకు లేదా జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనే కోరికతో కేసీఆర్ నిత్యం కేంద్రంతో కయ్యం ఆడుతూనే ఉన్నారు.
ఆ కారణంగా అని చెప్పకపోయినా రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టులు రాలేదు... అని కేసీఆర్, బిఆర్ఎస్ నేతలే చెప్పుకునేవారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోందంటూ బిఆర్ఎస్ పార్టీ చేత ధర్నాలు, దీక్షలు చేయించారు కదా?
కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వలేదని, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టలేదని, బయ్యారం ఉక్కు ఇవ్వలేదని నిత్యం ప్రజలకు పిర్యాదులు చేస్తూనే ఉండేవారు కదా?
అంటే కేసీఆర్ హయంలో కూడా బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కానీ కేసీఆర్ కేంద్రంపై కత్తి దూయడం తప్ప ప్రాజెక్టులు, నిధులు సాధించలేకపోయారని స్పష్టమవుతోంది. తమ హయంలో ఏమీ సాధించలేదని ఇంత గట్టిగా చెప్పుకున్నప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏవిదంగా నిందిస్తారు?