నేటికీ కోర్టుల చుట్టూ మల్లన్నసాగర్ నిర్వాసితులు ప్రదక్షిణాలు తప్పట్లే!

February 01, 2025


img

గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొమురవెల్లి మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ కోసం వేములఘాట్, పల్లె పహాడ్, లక్ష్మాపూర్, రాంపూర్ తదితర గ్రామాలలో 2,500 ఎకరాలు భూసేకరణ చేసింది.

2016 నుంచి ఈ ప్రక్రియ మొదలుపెట్టి 2019లో ముంపు ప్రాంతాల నిర్వాసితులను ఇళ్ళు  ఖాళీ చేయించింది.  

భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులు అందరికీ ముందుగా నష్టపరిహారం చెల్లించి, వారికి పునరావాసం కల్పించిన తర్వాతే ఇళ్ళు ఖాళీ చేయించాలి. కానీ నేటికీ అంటే 5 ఏళ్ళయినా ఇంకా చాలా మందికి నష్టపరిహారం చెల్లించనే లేదు!

ముఖ్యంగా వారిలో భర్తలు కోల్పోయి పిల్లల వద్ద ఉంటున్న మహిళలకు నష్ట పరిహారం చెల్లించేందుకు అధికారులు నిబందనల పేరుతో నిరాకరిస్తున్నారు. వారికి 65 ఏళ్ళు వయసు ఉన్నందున ప్రభుత్వం నుంచి వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నారని, పిల్లలతో కలిసి ఉంటున్నారని చెపుతూ వారికి నష్టపరిహారం చెల్లించడం లేదు. 

అయితే ఈ ప్రాజెక్ట్ కోసం తమ ఇళ్ళు, భూములు కోల్పోయాము కదా? దానికి నష్టపరిహారం చెల్లించాలి కదా?అని నిర్వాసిత వితంతువులు అధికారులను నిలదీస్తున్నా జవాబు చెప్పడం లేదు. దాంతో 35 మంది నిర్వాసిత వితంతువులు హైకోర్టులో పిటిషన్‌ వేసి తమకు న్యాయం చేయాలని కోరారు. 

ఈ కేసుపై జస్టిస్ కే లక్ష్మణ్ శుక్రవారం విచారణ జరిపి, “భర్తలు కోల్పోయిన మహిళలు పిల్లల వద్ద కాకపోతే మరెక్కడ ఉంటారు?వారి భర్తలు బ్రతికి ఉంటేనే నష్ట పరిహారం చెల్లిస్తాము లేకుంటే లేదని చెప్పడం ఏమిటి?

వారు ఎవరి వద్ద ఉంటున్నా ప్రాజెక్ట్ నిర్వాసితులే. కనుక వితంతు మహిళలని ఓ ప్రత్యేక కుటుంబంగా పరిగణించి చట్ట ప్రకారం వారందరికీ నష్టపరిహారం చెల్లించాల్సిందే. గతంలో కూడా మేము (హైకోర్టు) ఇదే చెప్పాము.

ఇప్పుడూ మళ్ళీ ఇదే చెపుతున్నాము. నాలుగు నెలల్లోగా నిర్వాసిత వితంతువులందరికీ నష్టపరిహారం చెల్లించాలి,” అని హైకోర్టు జస్టిస్ కే లక్ష్మణ్ తీర్పు చెప్పారు. 

2016-19 లో భూసేకరణ జరిపితే 5 ఏళ్ళయినా ఇంకా నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించకపోవడం అన్యాయమే కదా? 


Related Post