ఎమ్మెల్సీ ఎన్నికలు: బిఆర్ఎస్ పార్టీకి మరో అగ్నిపరీక్ష

January 31, 2025


img

త్వరలో జరుగబోయే మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బిఆర్ఎస్ పార్టీ పోటీ చేయాలా వద్దా?అని అయోమయంలో ఉంది. పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీలతో ఎటువంటి సంబంధం లేనప్పటికీ అవి తమకు సన్నిహితంగా ఉండే అభ్యర్ధులకు మద్దతు ఇచ్చి గెలిపించుకునే ప్రయత్నం చేస్తాయి. కనుక మూడు ప్రధాన పార్టీలు అభ్యర్ధులను ప్రకటించి బరిలో దిగుతాయి. 

ఇప్పటికే బీజేపి మూడు స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేయగా నేడో రేపో కాంగ్రెస్‌ కూడా ఖరారు చేయనుంది. అయితే బిఆర్ఎస్ పార్టీ అయోమయంలో ఉంది. 

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత నెలకొందని బిఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది. కనుక ఈ ఎన్నికలలో మూడు స్థానాలు గెలుచుకొని అది నిరూపించాల్సి ఉంటుంది. కానీ ఈ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధులు ఓడిపోతే, శాసనసభ, లోక్‌సభ ఎన్నికల తర్వాత మరోసారి ఎదురుదెబ్బ తగిలినట్లవుతుంది. దీంతో ప్రజలకు, పార్టీ శ్రేణులకు కూడా బిఆర్ఎస్ పార్టీ మరింత బలహీనపడిన్నట్లు తప్పుడు సంకేతాలు వెళతాయి. అలాగని ఈ ఎన్నికలకు దూరంగా ఉండిపోయినా తప్పుడు సంకేతాలు పంపిన్నట్లవుతుంది. 

ఒకవేళ మూడు స్థానాలు గెలుచుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగిందని చాటింపు వేసుకోవడానికి పనికి వస్తుంది తప్ప వాటి వలన బిఆర్ఎస్ పార్టీకి అదనంగా ఎటువంటి రాజకీయ ప్రయోజనమూ కలుగదు. ఎమ్మెల్సీలుగా గెలిచినవారు మండలిలో ప్రతిపక్ష బెంచీలలోనే కూర్చోవాలి. దాని వలన వారికి గౌరవం పెరుగుతుందేమో కానీ బిఆర్ఎస్ పార్టీకి ఎటువంటి ప్రయోజనం కలుగదు. గెలిచిన ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీవైపు వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. 

కనుక బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ నేడు ఫామ్‌హౌస్‌లో పార్టీ సీనియర్ నేతలతో చర్చించి ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయాలా వద్దా?అని నిర్ణయం తీసుకోబోతున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్-నిజామాబాద్‌-అదిలాబాద్-మెదక్ (పట్టభద్రుల నియోజకవర్గం), కరీంనగర్-నిజామాబాద్‌-అదిలాబాద్-మెదక్ (ఉపాధ్యాయ నియోజకవర్గం), నల్గొండ-వరంగల్-ఖమ్మం (ఉపాధ్యాయ నియోజకవర్గం) మూడు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

వీటి కోసం కేంద్ర ఎన్నికల కమీషన్ ఇప్పటికే షెడ్యూల్‌ ప్రకటించింది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్‌ ప్రకటించి, నామినేషన్స్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఫిబ్రవరి 27న  పోలింగ్ నిర్వహిస్తుంది. మార్చి 3న ఓట్లు లెక్కించి వెంటనే ఫలితాలు ప్రకటిస్తుంది.



Related Post