కుమార స్వామి: నాడు బకరా.. నేడు కేంద్రమంత్రి

January 30, 2025


img




ఒకప్పుడు మాజీ సిఎం కేసీఆర్‌ చుట్టూ కర్ణాటకకు చెందిన కుమారస్వామి ప్రదక్షిణాలు చేసేవారు. కర్ణాటక శాసనసభ ఎన్నికలలో రెండు పార్టీలు కలిసి పోటీ చేద్దామని, ఎన్నికల ఖర్చులకు అవసరమైన నిధులు సమకూర్చుతానని కేసీఆర్‌ హామీ ఈయడమే అందుకు కారణం. 

కానీ కర్ణాటక శాసనసభ ఎన్నికల గంట మ్రోగిన తర్వాత కేసీఆర్‌ హటాత్తుగా సైలంట్ అయిపోయారు. కర్ణాటకలో బిఆర్ఎస్ పార్టీ పోటీ చేసే ఆలోచన విరమించుకున్నారు. కనీసం కుమారస్వామి పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్ళలేదు. ఎవరినీ పంపించలేదు. 

కనీసం ఎన్నికల ఖర్చులకు నిధులు పంపిస్తారని చివరి నిమిషం వరకు ఎదురుచూస్తూనే ఉన్నామని కానీ కేసీఆర్‌ హ్యాండ్ ఇవ్వడంతో ఎన్నికలలో దెబ్బైపోయామని ఓటమి తర్వాత కుమారస్వామి స్వయంగా చెప్పారు. 

ఆనాడు కేసీఆర్‌ ఆయనని తన చుట్టూ తిప్పించుకొని బకరా చేశారు. కానీ ఆయన ఇప్పుడు కేంద్ర భారీ పరిశ్రమల శాఖా మంత్రి కాగా కేసీఆర్‌ పదవి, అధికారం కోల్పోయి ఫామ్‌హౌస్‌లో నుంచి అడుగు బయటపెట్టడం లేదు. 

ఇప్పుడు ఏపీ, తెలంగాణలతో సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిసి తమ తమ రాష్ట్రాలలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని లేదా వాటి కోసం నిధులు విడుదల చేయాలని వినతి పత్రాలు ఇస్తున్నారు. 

ఇదివరకు కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేసేందుకు సిద్దపడితే దానిని సింగరేణి సంస్థ చేత కొనుగోలు చేయించాలని కేసీఆర్‌ అనుకున్నారు. కానీ వివిద కారణాల వలన ఆ ఆలోచన విరమించుకున్నారు. 

ఆనాడు కేసీఆర్‌ చుట్టూ నిధుల కోసం తిరిగిన కుమారస్వామే ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని కాపాడేందుకు రూ.11,440 కోట్లు విడుదల చేశారు. 

నేడు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పర్యటించి అధికారులు, ఉద్యోగులతో సమావేశమయ్యి ప్లాంట్‌ ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. 



Related Post