ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒకరి తర్వాత ఒకరు చొప్పున అందరూ బెయిల్‌పై బయటకు వచ్చేస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎస్పీ తిరుపతన్నకు మొన్న హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకు వచ్చేశారు.
నేడు జయశంకర్ భూపాలపల్లి మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుకి, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరూ చెరో లక్ష చొప్పున రెండు ష్యూరిటీలు సమర్పించాలని, పాస్‌పోర్టులు కోర్టుకు సమర్పించాలని న్యాయ స్థానం ఆదేశించింది. విచారణకు సహకరించాలని, సాక్షులను, కేసుని ప్రభావితం చేయరాదని ఆదేశించింది.
వీరు ముగ్గురినీ గత ఏడాది మార్చి నెలలో పోలీసులు అరెస్ట్ చేయగా అప్పటి నుంచి జైల్లోనే ఉంటున్నారు. ఇప్పుడు ముగ్గురూ బెయిల్‌పై బయటకు వచ్చేశారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంటలిజన్స్ మాజీ ఓఎస్‌డీ ప్రభాకర్ రావు ఈ కేసు మొదలవక మునుపే అమెరికా వెళ్ళిపోయారు. మొదట హైదరాబాద్ తిరిగివచ్చి విచారణకు సహకరిస్తానని చెప్పారు.
కానీ పోలీసులు తనపై కూడా కేసు నమోదు చేసిన్నట్లు తెలుసుకొని అమెరికాలో రాజకీయ శరాణార్ధిగా ఆశ్రయం కల్పించాలని అమెరికా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.
ఆయన హైదరాబాద్ తిరిగి రారని స్పష్టమయ్యింది కనుక ఇంటర్ పోల్ సాయంతో హైదరాబాద్ తిరిగి రప్పించేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కానీ ఇంతవరకు వెనక్కు రప్పించలేకపోయారు.
మొదట్లో ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి కాంగ్రెస్ మంత్రులు గట్టిగా మాట్లాడేవారు. కానీ ఇప్పుడు అందరూ మౌనం వహిస్తున్నారు. నిందితులు అందరూ బెయిల్ మీద బయటకు వచ్చేస్తున్నారు. కనుక ఫోన్ ట్యాపింగ్ కేసు అటకెక్కిపోయిన్నట్లేనా?