ఇప్పటికే అమెరికా, కెనడా తదితర దేశాలలో ప్రవాస భారతీయులు జాతి వివక్ష, పోలీసుల వేధింపులు వంటి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అమెరికాలో ఎన్‌ఆర్‌ఐలకు, ముఖ్యంగా ఉన్నత విద్యలు అభ్యసించేందుకు వచ్చిన విద్యార్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కనుక విదేశాలలో ఉన్నవారు మరింత జాగ్రత్తగా, పద్దతిగా మెసులుకోవడం చాలా అవసరం. కానీ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బ్రిటన్‌లో బిఆర్ఎస్ పార్టీ విభాగం అధ్యక్షుడు నవీన్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐలు లండన్‌లో టవర్ బ్రిడ్జి వద్ద ప్లకార్డులు పట్టుకొని తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేశారు.
సిఎం రేవంత్ రెడ్డి 420 రోజుల పాలన పూర్తిచేసుకున్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను అమలుచేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారంటూ నిరసనలు వ్యక్తం చేశారు.
బ్రిటన్ బిఆర్ఎస్ పార్టీ విభాగం ఊపాధ్యక్షుడు రవికుమార్ రేతినేని తదితరులు బ్రిటన్ పార్లమెంట్ ఎదుట ప్లకార్డులు పట్టుకొని నిరసనలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం, బిఆర్ఎస్ పార్టీపై వారికి ఇంతగా అభిమానం ఉంటే రాష్ట్రానికి వచ్చినప్పుడు నిరసనలు చేసుకోవచ్చు. బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనవచ్చు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనితీరు నచ్చకపోతే సోషల్ మీడియా ద్వారా విమర్శించవచ్చు.
కానీ మన రాష్ట్ర ప్రభుత్వంపై పొరుగు దేశంలో ఈవిదంగా నిరసనలు తెలియజేయడం సబబు కాదు. దీనిని స్థానిక పోలీసులు తీవ్రంగా పరిగణించి కేసు నమోదు చేస్తే ఇబ్బంది పడేదివారే తప్ప కేసీఆర్, కేటీఆర్ కాదు.
విదేశాలలో ఉన్నవారికి రాజకీయాలపై ఆసక్తి ఉండకూడదని కాదు. కానీ ఈవిదంగా అత్యుత్సాహం ప్రదర్శిస్తే సమస్యలలో చిక్కుకునే ప్రమాదం ఉంటుందని గ్రహిస్తే మంచిది.