అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రోజుకో బాంబు పేలుస్తూనే ఉన్నారు. మొన్న ‘జన్మతః పౌరసత్వం’ రద్దు చేసిన ట్రంప్, ఇప్పుడు ఆమెరికన్ పౌరులకు ఆదాయపన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలనుకుంటున్నానని చెప్పారు.
అమెరికా ప్రజలకు ఆదాయపన్ను మినహాయిస్తే మనకెందుకు అభ్యంతరం?అని సందేహం కలుగవచ్చు. నిజమే ఆయన తన దేశ ప్రజలకు మేలు చేస్తానంటే అందరూ సంతోషిస్తారు. కానీ వారు పన్ను కట్టకపోతే అమెరికా ప్రభుత్వానికి తగ్గే ఆదాయాన్ని ప్రపంచదేశాలు భరించాలంటే?
ట్రంప్ అదే చేయబోతున్నారు. భారత్‌తో సహా ప్రపంచ దేశాల నుంచి ఏటా లక్షల కోట్ల డాలర్ల విలువగల ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతుంటాయి. కేవలం వస్తు ఉత్పత్తులే కాదు.. అమెరికాలో వైద్య, ఆర్ధిక, వాణిజ్య తదితర సంస్థలకు భారత్ వంటి దేశాల నుంచి ఐటి సేవలు (ఐటి ఎగుమతులు) కూడా అందిస్తుంటాయి.
ఆ ఐటి ఎగుమతులే మరిన్ని లక్షల కోట్లు ఉంటాయి. కనుక ఉత్పత్తులు, సేవాలపై భారీగా పన్నులు పెంచి లోటు భర్తీ చేసుకోవాలని ట్రంప్ అనుకుంటున్నారు.
ఒకవేళ అదే జరిగితే భారత్‌తో సహా ప్రపంచదేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఎగుమతులపై పన్ను భారం పెరిగితే, అది అటు తిరిగి, ఇటు తిరిగి అది దేశంలోని పౌరులపైనే పడే అవకాశం కూడా ఉంటుంది. కనుక ట్రంప్ నిర్ణయం అమలులోకి వస్తే అమెరికన్లు మరింత సుఖంగా, దర్జాగా జీవించగలుగుతారు. వారు అలా జీవించేందుకు ప్రపంచదేశాల ప్రజలు మూల్యం చెల్లించాల్సి రావచ్చు.