గద్దర్‌: బండి వాదన బీజేపికే నష్టం!

January 28, 2025


img

ప్రజా గాయకుడు గద్దర్‌కి పద్మ అవార్డుకి తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు చేసినా ఇవ్వకపోవడంపై సిఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, ప్రముఖ కవులు అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు పేర్లు సిఫార్సు చేస్తే వారిలో ఏ ఒక్కరికీ పద్మ అవార్డు ఇవ్వకపోవడాన్ని సిఎం రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. 

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ స్పందిస్తూ, “బీజేపికి చెందిన వందల మంది కార్యకర్తలని గద్దర్ హత్య చేయించారు. కాంగ్రెస్‌, టీడీపీ కార్యకర్తలు, పోలీసులను ఆయన హత్య చేయించారు. మా ఎంపీ డీకే అరుణ తండ్రి చిట్టెం నర్సిరెడ్డిని, మంత్రి దుదిళ్ళ శ్రీధర్ బాబు తండ్రి దుదిళ్ళ శ్రీపాదరావులను మావోయిస్టులు హత్య చేశారు. 

మావోయిస్టుగా పలువురు మరణాలకు కారకుడైన గద్దర్‌కు అవార్డు ఇచ్చే ప్రసక్తే లేదు. మావోయిస్ట్ భావజాలం ఉన్న అటువంటి వ్యక్తుల పేర్లను ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులకు సిఫార్సు చేయడం తప్పు. అందుకు అర్హత కలిగిన వ్యక్తుల పేర్లు సిఫార్సు చేయాలి. 

అయినా రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రతీ ఒక్కరికీ పద్మ అవార్డులు ఇవ్వడం సాధ్యం కాదని సిఎం రేవంత్ రెడ్డి గ్రహిస్తే మంచిది. కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగానే చూస్తుంది. తెలంగాణ పట్ల వివక్ష చూపాల్సిన అవసరం ఏమిటి?” అని ప్రశ్నించారు. 

గద్దర్ మావోయిస్టుగా ఉన్నప్పుడు అన్ని హత్యలకు బాధ్యుడు అయ్యుంటే కేంద్రహోంశాఖ ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసి ఉండొచ్చు. కానీ ఎందుకు చేయలేదు?బండి సంజయ్‌ సమాధానం చెప్పాలి. 

గద్దర్ జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత ప్రజాకవిగా తెలంగాణ ఉద్యమాలలో చాలా కీలకపాత్ర పోషించారు. కానీ కేసీఆర్‌ ఆయనని అవమానించారు. సిఎం రేవంత్ రెడ్డి ఆయన గౌరవార్ధం గద్దర్ సినీ అవార్డులు ప్రవేశపెట్టి ఉగాది రోజున అందించబోతున్నారు. 

గతంలో సీతక్క కూడా మావోయిస్తులతో కలిసి పనిచేశారు. కానీ ఆమె మావోయిస్టులని విడిచిపెట్టి రాజకీయాలలోకి వచ్చి ప్రస్తుతం మంత్రిగా పనిచేస్తూ అందరి ఆదరణ పొందుతున్నారు. గద్దర్ ప్రస్థానం కూడా ఇంచుమించు ఇదేవిదంగా సాగింది కదా?

గద్దర్‌కి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డు ఇవ్వకపోయినా నష్టం లేదు. కానీ బీజేపి అభ్యంతరాల వలననే గద్దర్‌కి పద్మ అవార్డు ఇవ్వలేదని బండి సంజయ్‌ మాటలతో స్పష్టం అయ్యింది. కానీ మిగిలినవారిలో ఏ ఒక్కరికీ ఎందుకు ఇవ్వలేదు? 

తెలంగాణ ప్రజలు గౌరవించే గద్దర్‌ గురించి బండి సంజయ్‌ ఈవిదంగా మాట్లాడటం వలన బీజేపి పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతుందని, పార్టీకి రాజకీయంగా నష్టం జరుగుతుందని గ్రహిస్తే మంచిది. 


Related Post