దావోస్‌: కేటీఆర్‌ కంటే రేవంత్ రెడ్డి బెటర్?

January 24, 2025


img

బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐటి కంపెనీలు, పరిశ్రమలశాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌, విదేశీ పర్యటనలకు, దావోస్‌ సదస్సుకి వెళితే ఖచ్చితంగా రూ.20-30 వేల కోట్లు పెట్టుబడులు సాధించుకు రావాల్సిందే అన్నట్లు ఉండేది. 

కేటీఆర్‌ టీమ్‌ చురుకుదనం, పెట్టుబడిదారులను మెప్పించడంలో వారి నేర్పు చూసిన ఇరుగుపొరుగు రాష్ట్రాల ప్రజలు ఇటువంటి మంత్రి మనకీ ఉంటే ఎంత బాగుండును? అని అనుకునేవారు. 

కేసీఆర్‌- కేటీఆర్‌ హయంలో పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలకు ఓ స్వర్ణయుగమని చెప్పొచ్చు. కేటీఆర్‌ టీమ్‌ కృషి వలన తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా హైదరాబాద్‌ నగరం దేశంలోనే నంబర్: 1గా ఎదిగిపోయింది. 

ఆరోజు ఆయన చేసిన కృషి, వేసిన బలమైన పునాదుల వల్లనే నేడు సిఎం రేవంత్ రెడ్డి దావోస్‌ సదస్సు నుంచి అవలీలగా రూ.1.79 లక్షల కోట్లు పెట్టుబడులు, ప్రసిద్ద కంపెనీలను సాధించుకువచ్చారని చెప్పొచ్చు.

కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా నిరుద్యోగం, అరాచక పరిస్థితులు తాండవిస్తున్నాయని, ఎన్నికల హామీలు అమలుచేయలేక రాష్ట్రం అప్పులపాలైపోయిందని రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నారని కేటీఆర్‌ స్వయంగా ఆరోపిస్తూనే ఉన్నారు. అంటే కేటీఆర్‌ చెప్పిన ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఒక్క ఏడాది రేవంత్ రెడ్డి పాలనలో భ్రష్టు పట్టిపోయిందని అనుకోవాలి. 

ఒకవేళ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు నెలకొని ఉంటే పెట్టుబడులు, ఇంత పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చేవా? అంటే కాదనే అర్దమవుతుంది. పైగా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా కేవలం ఒక్క ఏడాది అనుభవమే ఉంది. ఆయనకు సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడటం కూడా రాదని బిఆర్ఎస్ పార్టీ ఎగతాళి చేస్తుంటుంది కూడా. 

కానీ రేవంత్ రెడ్డి రెండో పర్యటనలోనే ఇంత భారీ పెట్టుబడులు సాధించుకు వచ్చి కేటీఆర్‌ కంటే అన్ని విదాల తానే బెటర్ అని నిరూపించుకున్నారు. దావోస్‌ సదస్సు నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఏకంగా రూ.1.79 లక్షల కోట్లు పెట్టుబడులు, ప్రసిద్ద కంపెనీలను సాధించుకువచ్చి బిఆర్ఎస్ పార్టీ వాదనలన్నీ తప్పని రేవంత్ రెడ్డి నిరూపించారు కూడా. 

అయినా కేటీఆర్‌, బిఆర్ఎస్ నేతలు ఎవరికీ ఆయనని అభినందించడానికి నోరు రావడం లేదు. గ్రామ సభల పేరుతో రేవంత్ రెడ్డిని విమర్శించడం మాత్రం మారిచిపోలేదు.



Related Post