ఈసారి దావోస్ సదస్సులో సిఎం రేవంత్ రెడ్డి బృందం తెలంగాణ రాష్ట్రానికి ఏకంగా రూ.1.32 లక్షల కోట్లు పెట్టుబడులు సాధించగా, ఆయన కంటే ఎంతో అనుభవజ్ఞుడు, పలువురు పారిశ్రామికవేత్తలతో, ఐటి కంపెనీల సీఈవోలతో మంచి పరిచయాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడు బృందం ఒక్క రూపాయి కూడా సాధించకుండా తిరుగు ప్రయాణం అవడం ఎవరికైనా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
సదస్సు చివరి రోజున తెలంగాణలో రూ.60,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ వెబ్ సర్వీసస్ సంస్థతో ఒప్పందం జరగడం విశేషం. ఈసారి దావోస్ సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడులతో పాటు దిగ్గజ కంపెనీలు సాధించుకోవడం చాలా సంతోషకరమైన విషయమే. ఈ పెట్టుబడులు, పరిశ్రమల వలన మరింత వేగంగా రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది. మరిన్ని వేలమందికి ఉద్యోగాలు, ఉపాధి లభించనున్నాయి.
దావోస్ సదస్సు నుంచి ఏపీకి ఒక్క రూపాయి పెట్టుబడి సాధించలేకపోవడంతో సిఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ ఇద్దరిపై వైసీపీ నేతలు, వారి సొంత మీడియా ఘాటుగా విమర్శలు చేయకుండా ఉండదు. కనుక వారిరువురూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవలసి రావచ్చు.