ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి బహిరంగంగా హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారు.
ఆయన ఈరోజు ఉదయం ఆదర్శ్ నగర్‌లో పర్యటించారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ, “జీహెచ్ఎంసీ అధికారుల తీరు వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. పాతబస్తీలో అక్రమ నిర్మాణాల జోలికి వెళ్ళలేరు కానీ ఇక్కడ ఫుట్‌పాత్‌లపై నివసిస్తున్న పేదల ఇళ్ళను, వారి జీవనాధారాన్ని అధికారులు ధ్వంసం చేశారు. పేదవారిపైనేనా మీ ప్రతాపం?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“కొందరు అధికారులు అందరూ ప్రభుత్వానికి కట్టుబడి పనిచేయాలని మరిచిపోయి ఎవరికి వారు తామే సుప్రీం అనుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వారి తీరు వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. మాధాపూర్‌లో రోడ్ పక్కన టిఫిన్ సెంటర్ పెట్టుకొని జీవిస్తున్న కుమారిని అధికారులు ఇలాగే వేధించారు. అప్పుడు సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకొని వారిని కట్టడి చేశారు. అదేవిదంగా జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులను కూడా సిఎం రేవంత్ రెడ్డి కట్టడి చేయాలి,” అని దానం నాగేందర్ విజ్ఞప్తి చేశారు.
దానం నాగేందర్ వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలకు, ప్రభుత్వంలో ఉన్న కొందరికీ అభ్యంతరకరంగా అనిపించవచ్చు. కానీ జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు నగరంలో పేదలపై ఈవిదంగా ప్రతాపం చూపుతుంటే, వారిలో తప్పకుండా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది.
ఇప్పటికే హైడ్రా కూల్చివేతలతో నష్టపోయి రోడ్డున పడ్డ వేలాది కుటుంబాలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకొని తప్పు చేశామని బహిరంగంగానే చెపుతున్నారు. వారందరూ త్వరలో జరుగబోయే జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేయకుండా ఉంటారా?ఆలోచిస్తే మంచిది.