కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ ఎదుట రాష్ట్ర ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ పీసీ ఘోష్ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాదానాలు ఎవరికైనా దిగ్బ్రాంతి కలిగిస్తాయి.
ఈ ప్రాజెక్టు ఆదాయ వ్యయాల గురించి అడిగిన ఓ ప్రశ్నకు రామకృష్ణారావు ఏమని సమాధానం చెప్పారంటే, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నాటి ప్రభుత్వం కొంత నిదులు సమకూర్చగా మిగిలిన సొమ్ముని ఆర్ధిక సంస్థల నుంచి అప్పుగా తీసుకుంది.
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వచ్చే నీటిని రాష్ట్రంలో పరిశ్రమలకు అందించడం ద్వారా, త్రాగునీటిని విక్రయించడం ద్వారా ఆదాయం లభిస్తుందని అప్పటి ప్రభుత్వం ఆర్ధిక సంస్థలకు చెప్పి రుణాలు తీసుకుంది. వాటి చెల్లింపులకు రాష్ట్ర ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చింది.
కానీ పరిశ్రమలకు నీటిని విక్రయించడం ద్వారా కాళేశ్వరం కార్పొరేషన్‌కు రూ.7 కోట్లు మాత్రమే ఆదాయం లభిస్తోంది. కనుక ఈ ప్రాజెక్టుకి ఆదాయం లేకపోవడంతో అప్పుల చెల్లింపులకి ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చినందున ఈ ఆర్ధిక సంవత్సరంకుగాను అసలు రూ.7,382 కోట్లు, వడ్డీ కింద మరో రూ.6,519 కోట్లు కలిపి మొత్తం రూ.13,901 రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని రామకృష్ణారావు చెప్పారు.
సుమారు లక్ష కోట్లు వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మిస్తే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు నిరుపయోగంగా మారడం బాధాకరమే కదా? నిరుపయోగంగా పడున్న వాటి కోసం నేటికీ రూ.13,901 కోట్లు చెల్లించక తప్పడం లేదు.