సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయవద్దని అందరూ చెపుతూనే ఉంటారు. కానీ చేస్తూనే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు అమలుచేయకుండా ప్రజలను మోసం చేయడమే కాక ఇతర రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినప్పుడు సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రచారానికి వెళ్ళి అక్కడ కూడా అబద్దాలు చెపుతున్నారని బిఆర్ఎస్ పార్టీ వాదిస్తుండటం అందరూ వింటూనే ఉన్నారు.
అదేవిదంగా తెలంగాణలో తమ ప్రభుత్వం రూ.500 లకే వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడాన్ని కూడా బిఆర్ఎస్ పార్టీ తప్పు పడుతోంది.
“బీజేపి, బిఆర్ఎస్ పార్టీల పాలనలో వంట గ్యాస్ సిలిండర్లు ధర రూ.1200 ఉండగా తమ ప్రభుత్వం కేవలం రూ.500లకే ఇస్తోందని తెలంగాణ కాంగ్రెస్ చెప్పుకోవడాన్ని ఆ రెండు పార్టీలు తప్పు పడుతున్నాయి. రాష్ట్రంలో ప్రజలందరికీ రూ.500లకే వంటగ్యాస్ అందిస్తే ఆవిదంగా చెప్పుకున్నా అర్దముంటుంది.
కానీ కొంత మందికి మాత్రమే ఇస్తూ అందరికీ ఇస్తున్నట్లు చాటింపు వేసుకోవడం దేనికని ఆ రెండు పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కూడా రాష్ట్రంలో గ్యాస్ లబ్ధిదారులు మినహా మిగిలిన ప్రజలందరూ ఒక్కో సిలిండర్ రూ.1000-1100 చెల్లిస్తున్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500లకే గ్యాస్ సిలిండర్స్ ఇస్తోందని చెప్పుకోవడం ప్రజలను మభ్యపెట్టడం కాదా? అని బీజేపి, బిఆర్ఎస్ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.