జగన్‌కి పవన్ కళ్యాణ్‌ చురకలు

January 19, 2025


img

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం మద్యాహ్నం విజయవాడ సమీపంలో ఎన్‌హెచ్ఆర్డీ కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ మాట్లాడుతూ, “విపత్తులన్నీ ప్రకృతి వల్లనే జరుగకపోవచ్చు. కొన్నిసార్లు మానవ తప్పిదాల వలన విపత్తులు సంభవిస్తుంటాయి.

 గత 5 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్‌‌ రాష్ట్రాన్ని పాలించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పిదాల వలన రాష్ట్రానికి అటువంటి పెద్ద విపత్తే ఏర్పడింది. 

మా కూటమి ప్రభుత్వం కేంద్రం సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్‌‌ రాష్ట్రాన్ని ఆ విపత్తు వలన కలిగిన నష్టం నుంచి బయటపడేసేందుకు కృషి చేస్తోంది. 

ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ అమిత్ షా ఇద్దరూ ఆంధ్రప్రదేశ్‌‌ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టుకొని అభివృద్ధి చేసుకోవడానికి మా కూటమి ప్రభుత్వానికి అన్ని విదాల తోడ్పడుతున్నారు. అందుకు వారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని అన్నారు. ఇదే వివరిస్తూ సోషల్ మీడియాలో ఆయన కార్యాలయం ఓ పోస్ట్ పెట్టింది.

ఐదేళ్ళ జగన్‌ పాలనలో ఆంధ్రప్రదేశ్‌‌ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అందరూ చూశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌ అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చేస్తూ, రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు తెచ్చుకొని రాష్ట్రానికి ఆదాయం, యువతకు ఉద్యోగాలు కల్పించేవారు. 

కానీ ఏపీని పాలించిన జగన్‌ సంక్షేమ పధకాలు అమలు చేస్తే చాలు ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అదే రాష్ట్రాభివృద్ధి అంటూ అభివృద్ధికి కొత్త నిర్వచనం చెప్పి, సంక్షేమ పధకాల కోసం లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారు. 

ఒక రాష్ట్రానికి లేదా దేశానికి ఐదేళ్ళు చాలా అమూల్యమైనది. జగన్‌ తన పార్టీ రాజకీయ ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటూ ఆంధ్రప్రదేశ్‌‌ రాష్ట్రాన్ని దారుణంగా దెబ్బ తీశారు. అందుకే ఇది మానవ తప్పిదం వలన జరిగిన విపత్తు అని పవన్ కళ్యాణ్‌ అన్నారు.       


Related Post