మీరు అన్ని హామీలు అమలుచేశారా.. కేటీఆర్‌ సార్?

January 18, 2025


img

తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు మూడు నెలలకే హామీలు అమలు చేయలని హరీష్ రావు, కేటీఆర్‌ ఒత్తిడి చేయడం ప్రారంభించారు. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మితో సహా కొన్ని పధకాలు అమలుచేశారు. వాటిలో మహాలక్ష్మీ పధకాన్ని కేటీఆరే తప్పు పడుతూ దాని వలన ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారంటూ మొసలి కన్నీళ్ళు కార్చుతున్నారు కదా?  

రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలలలోనే రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తే, చేయలేదంటూ కేటీఆర్‌ నిన్న రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో రైతుదీక్ష చేశారు. రాష్ట్రంలో ఒక్క నియోజకవర్గంలోనైనా వందశాతం ఋణమాఫీ చేశామని చెప్పగలవా రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్‌ సవాలు విసిరారు. రుణమాఫీ కానివారిని తీసుకువచ్చి సభలో మాట్లాడించి ఇదే సాక్ష్యం అని అన్నారు. 

కేసీఆర్‌ పంట రుణాల మాఫీ చేయడానికి పదేళ్ళు సమయం తీసుకున్నా పూర్తిగా చేయలేదు. నాలుగైదు విడతలలో చెల్లించిన ఆ సొమ్ము కూడా వడ్డీలకే పోవడంతో అది కూడా వృధా అయింది. అన్ని వేలకోట్లు ఖర్చు పెట్టినా రైతులు రుణవిముక్తులు కానే లేదు కదా? అందువల్లే ఇప్పుడు ఆ భారం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కూడా మళ్ళీ పడింది కదా?  

అయినా రాష్ట్రంలో రైతులందరి రుణాలు మాఫీ చేయడం ఏ ప్రభుత్వం వల్లా కాదని కేసీఆరే స్వయంగా నిరూపించినప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డిని కేటీఆర్‌ ఎలా నిలదీస్తున్నారు?

తమ పార్టీ అధికారంలోకి వస్తే నెలకు రూ.3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని బిఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. దళితులకు మూడెకరాల వ్యవసాయ భూమి ఇస్తామని చెప్పింది. అర్హులైన ప్రతీ ఒక్కరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. ఇంకా చాలా హామీలే ఇచ్చింది. కానీ చాలా వాటిని అమలుచేయనే లేదు. ఏమంటే ప్రభుత్వం వద్ద డబ్బు లేదని, కరోనా, లాక్ డౌన్ వచ్చిందని కుంటిసాకులు చెప్పి తప్పించుకుంది.  

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణానికి డబ్బులు లేనప్పుడు కళ్ళు చెదిరిపోయేలా నిర్మించిన రాజభవనాల నిర్మాణాలకి, రేసింగ్ ఈవెంట్‌కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి?దీనిని బట్టి బిఆర్ఎస్ పార్టీ చెప్పే మాటలు వేరు దాని ప్రాధాన్యతలు వేరని స్పష్టమవుతోంది కదా?   

పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు హామీలు అమలుచేయని కేటీఆర్‌, ఇప్పుడు అవన్నీ మరిచిపోయిన్నట్లు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిందిస్తుండటం విడ్డూరంగా ఉంది. ఒకవేళ హామీల అమలు గురించి రేవంత్ రెడ్డిని ప్రశ్నించాలనుకుంటే, విమర్శించాలనుకుంటే, కేటీఆర్‌ ముందుగా కేసీఆర్‌నే ప్రశ్నించాలి. విమర్శించాల్సి ఉంటుంది.      



Related Post