ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టుకి బిఆర్ఎస్

January 16, 2025


img

కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బిఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో నేడు పిటిషన్‌ వేసింది. వారిపై చర్యలు తీసుకోవాలని తాము స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు వినతి పత్రాలు ఇచ్చినా, హైకోర్టు సూచించినా పట్టించుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

కనీసం ఇంతవరకు వారికి స్పీకర్ నోటీస్ కూడా ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని, కనుక నాలుగు వారాలలోగా వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ని ఆదేశించాలని బిఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుని కోరింది. 

వారిలో కడియం, దానం, తెల్లంకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్‌, మిగిలిన ఏడుగురికీ వ్యతిరేకంగా రిట్ పిటిషన్‌ దాఖలు చేసింది. బిఆర్ఎస్ పార్టీ వేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. 

ఇంతకు ముందు బిఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం, ఇది స్పీకర్ పరిధిలోని అంశం కనుక తాము జోక్యం చేసుకోలేమని, కానీ స్పీకర్ తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని సూచన మాత్రం చేసింది. 

శాసనసభ, పార్లమెంట్ వ్యవహారాలలో న్యాయవ్యవస్థల పరిధిలో ఉండవు కనుక సాధారణంగా జోక్యం చేసుకోవు. కొన్ని సందర్భాలు, కొన్ని వ్యవహారాలలో న్యాయస్థానాలు జోక్యం చేసుకున్నప్పటికీ సాధారణంగా ఇటువంటి వ్యవహారాలలో జోక్యం చేసుకోవు. 

కనుక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బిఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పటికీ బహుశః కొంత న్యాయ ప్రక్రియ సాగుతుందే తప్ప ఎటువంటి ప్రయోజనమూ ఉండకపోవచ్చు.


Related Post