బిఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల కోర్టులు, పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరుగుతూ చాలా బిజీ బిజీగా గడుపుతున్నారు. మొన్న హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం ఇంటికి తిరిగి వచ్చిన ఆయనకు మసాబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ నుంచి మరో నోటీస్ జారీ అయ్యింది.
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హడావుడి చేసినప్పుడు, డ్యూటీలో ఉన్న ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్‌తో దురుసుగా ప్రవర్తించినందుకు ఆయన పిర్యాదు మేరకు మసాబ్ ట్యాంక్ పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
ఈ కేసుని విచారిస్తున్న మసాబ్ ట్యాంక్ ఇన్‌స్పెక్టర్ పరశురామ్ పాడి కౌశిక్ రెడ్డికి నోటీస్ పంపించి గురువారం పోలీస్ స్టేషనలొ విచారణకు హాజరు కావలసిందిగా కోరారు. అయితే రేపు కరీంనగర్ జిల్లా కోర్టులో విచారణకు హాజరుకావలసి ఉన్నందున శుక్రవారం వస్తానని పాడి కౌశిక్ రెడ్డి సమాధానం పంపారు.
ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీలో సీనియర్లు అందరూ అవసరమైనప్పుడు మాత్రమే క్లుప్తంగా మాట్లాడుతూ మిగిలిన సమయంలో ‘సైలంట్ మోడ్’లో ఉంటున్నారు. కనుక పార్టీలో కేటీఆర్, హరీష్ రావుల గొంతులు మాత్రమే వినిపిస్తున్నాయి.
కనుక కేసీఆర్ సూచన మేరకు పాడి కౌశిక్ ఇంత హడావుడి చేస్తున్నారో లేదా పార్టీలో మరింత గుర్తింపు సంపాదించుకొని రాజకీయంగా ఎదిగేందుకు ఇదే సరైన సమయమని భావించి హడావుడి చేస్తున్నారో కానీ దాని వలన కోర్టులు, పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరగాల్సి వస్తోంది కూడా.