నిజామాబాద్ పసుపు రైతుల దశాబ్ధాల కల ‘పసుపు బోర్డు’ ఎట్టకెలకు సాకారం అయ్యింది. కేంద్ర వాణిజయశాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్ పద్దతిలో నిజామాబాద్‌లో పసుపు బోర్డుని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపి ఎంపీ ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “ నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎంపీ ధర్మపురి అర్వింద్, మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చాలా కృషి చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు ద్వారా నిజామాబాద్ పసుపు రైతులకు చాలా మేలు కలుగబోతోంది,” అని అన్నారు.
పసుపు బోర్డు ఛైర్మన్‌గా జిల్లాలోని ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామానికి చెందిన బీజేపి నాయకుడు పల్లె గంగారెడ్డి నియమితులయ్యారు.
త్వరలోనే పసుపు బోర్డులో మిగిలిన పడవులన్నీ ఎలాగూ భర్తీ చేస్తారు. కానీ జిల్లాలో పసుపు పండించే రైతులకు పసుపు బోర్డు ఏం చేయబోతోంది? పసుపు బోర్డు ఏర్పాటుతో రైతులకు మేలు కలుగుతుందా లేదా రాజకీయ నిరుద్యోగులకు మేలు కలుగుతుందా? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభిస్తుంది.