ఎఫ్-1 రేసింగ్ కేసులో మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ని హైకోర్టు కొట్టివేయడంతో ఆయన జనవరి 8న సుప్రీంకోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ద్విసభ్య ధర్మాసనం నేడు కేటీఆర్ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది. కేటీఆర్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో కేవీయట్ పిటిషన్ వేస్తూ, ఈ కేసులో తీర్పు వెలువరించే ముందు తమ వాదనలు కూడా వినాలని కోరింది.
కనుక నేడు సుప్రీంకోర్టు కేటీఆర్ పిటిషన్‌పై విచారణ చేపట్టినప్పటికీ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కౌంటర్ దాఖలు చేయాలని కోరుతూ కేసు వాయిదా వేసే అవకాశం ఉండవచ్చు.
కానీ కేటీఆర్ న్యాయవాదుల అభ్యర్ధన మేరకు ఈ కేసు విచారణ పూర్తయ్యేవరకు లేదా కొన్ని రోజుల వరకు ఆయనని అరెస్ట్ చేయవద్దని మద్యంతర ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉండవచ్చు.
ఇదే కేసులో ఈడీ కూడా కేటీఆర్‌పై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి నోటీస్ పంపింది. జనవరి 7న ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో జనవరి 16న విచారణకు హాజరుకావాలంటూ ఈడీ మరో నోటీస్ పంపింది.
ఇప్పటికే ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్, రేపు ఈడీ విచారణకు కూడా తప్పకుండా హాజరావుతానని చెప్పారు. ఈడీ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కనుక సుప్రీంకోర్టు కేటీఆర్‌కి తాత్కాలిక ఉపశమనమైనా కల్పిస్తుందో లేదో త్వరలో తెలుస్తుంది.