విజయవాడలో 35వ పుస్తక మహోత్సవం జరుగుతోంది. సాధారణంగా రాజకీయ నాయకులు ఇటువంటి వాటికి రారు. వచ్చిన పుస్తకాలు కొనరు. ఫోటోలకి ఫోజులిచ్చి వెళ్లిపోతుంటారు.
కానీ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం అక్కడకు వెళ్ళి సుమారు రెండున్నర గంటలసేపు అన్ని స్టాల్స్‌లో నుంచి తనకు నచ్చిన పుస్తకాలు కొనుగోలు చేశారు.
వాటిలో కొన్ని తన కోసం, మిగిలిన వాటిని పిఠాపురంలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న గ్రంధాలయం కోసం కొనుగోలు చేశారు.
పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన పుస్తకాలలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పుస్తకాలున్నాయి. వాటిలో అనేకం సాహిత్యానికి సంబందించినవి కాగా మరికొన్ని చరిత్ర, భారతీయ చట్టాలు, పర్యావరణం, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబందించినవి ఉన్నాయి.
ఇవి కాక తెలుగులో సినీ, రాజకీయ విశ్లేషణలు, వ్యవసాయం పశువుల పెంపకం, పాడి పరిశ్రమ, ప్రముఖుల రచనలు, తెలుగు, ఇంగ్లీషు భాషలో వచ్చిన వ్యక్తిత్వ వికాస పుస్తకాలు వగైరా కొనుగోలు చేశారు. డాక్టర్ విక్టర్ ఈ ఫ్రాంక్ వ్రాసిన ‘మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్’ అనే వ్యక్తిత్వ వికాస పుస్తకం కొనుగోలు చేశారు.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ రచయిత నాజీల నిర్బందంలో ఉన్నప్పుడు వ్రాసిన ఈ పుస్తకం తనని ఎంతగానో ప్రభావితం చేసిందని, మనుషులు నిరాశా నిస్పృహల నుంచి ఏవిదంగా బయటపడవచ్చో దీనిలో చాలా చక్కగా వివరించారని పవన్ కళ్యాణ్ చెప్పారు. కనుక ఈ పుస్తకాలను మిత్రులకు కానుకగా ఇస్తానంటూ రెండు మూడు డజన్ల కాపీలు కొనుగోలు చేశారు.
పుస్తకాల ప్రదర్శనలో ఇంతవరకు జరిగిన పుస్తకాల అమ్మకాలన్నీ ఒక ఎత్తు అయితే నిన్న పవన్ కళ్యాణ్ వల్ల జరిగిన అమ్మకాలు మరో ఎత్తు అని చెప్పొచ్చు. ఎందువల్ల అంటే ఆయన ఒక్కరే సుమారు రూ.5 లక్షలు విలువగల పుస్తకాలు కొనుగోలు చేశారు!
ఓ రాజకీయ నాయకుడు, ఉప ముఖ్యమంత్రికి ఇంత పుస్తకాభిరుచి ఉండటం, స్వయంగా వచ్చి పుస్తకాలు ఎంపిక చేసుకొని కొనుగోలు చేయడం చాలా గొప్ప విషయమే కదా?