తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ గేమ్ చేంజ్‌?

January 12, 2025


img

రామ్ చరణ్‌-శంకర్ సినిమాకి ఏ ఉద్దేశ్యంతో గేమ్ చేంజర్‌ అని పేరు పెట్టుకున్నారో కానీ ఆ సినిమా రిలీజ్‌కి నెల రోజుల ముందు నుంచే పుష్ప-2తో గేమ్ చేంజ్‌ ప్రారంభం అయ్యింది. 

ఆ తర్వాత సంధ్య థియేటర్‌ ఘటన, తదనంతర పరిణామాలతో తెలంగాణలోనే కాకుండా ఏపీలో కూడా మరోసారి గేమ్ చేంజ్‌ అయ్యింది. నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌రాజు సిఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడి అదనపు షోలు వేసుకునేందుకు, టికెట్ ఛార్జీలు పెంచుకునేందుకు ప్రభుత్వం చేత జీవో జారీ చేయించి మళ్ళీ గేమ్ చేంజ్‌ చేశారు. 

కానీ హైకోర్టు జోక్యం చేసుకొని తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసి గేమ్ చేంజ్‌ చేసింది. హైకోర్టు ఆదేశం మేరకు గేమ్ చేంజర్‌కు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక అనుమతులను రద్దు చేస్తూ నిన్న జీవో జారీ చేసింది. 

సరిగ్గా సంక్రాంతి సెలవులు మొదలైన రోజు నుంచే ఈ జీవో విడుదల చేయడంతో గేమ్ చేంజర్‌ సంక్రాంతికి అదనపు రాబడి అంతా కోల్పోయింది. 

వందల కోట్ల భారీ భారీ బడ్జెట్‌తో తీసిన గేమ్ చేంజర్‌ భారీ అంచనాలతో బరిలో దిగి ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో, నేడు విడుదలైన ‘డాకూ మహరాజ్’, 14న విడుదల కాబోతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలకు కలిసి రావడం కూడా గేమ్ చేంజ్‌ అనే చెప్పుకోవచ్చు.

కానీ కలెక్షన్స్‌ రికార్డులు బద్దలు కొట్టిన పుష్ప-2 సినిమాయే, సినీ పరిశ్రమకి ఎంతో కీలకమైన సంక్రాంతి సీజన్‌ని ఈవిదంగా పాడుచేసింది. కనుక అసలు సిసలైన గేమ్ చేంజర్‌ పుష్ప-2యే అని చెప్పక తప్పదు. 



Related Post