తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనాలకు గురువారం ఉదయం నుంచి ఉచిత టోకెన్ల పంపిణీ చేసేందుకు టీటీడీ తిరుపతి పట్టణంలో 8 కౌంటర్లు ఏర్పాటు చేసింది. వాటిలో బెతేడ పట్టెడ కౌంటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు చనిపోయారు.
వెంటనే మంత్రుల బృందం, ఆ తర్వాత సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, సంబందిత శాఖల ఉన్నతాధికారులు తిరుపతి చేరుకొని పరిస్థితిని సమీక్షించి అవసరమైన చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ ఏపీ ప్రభుత్వం రూ.25 లక్షలు నష్టపరిహారం ప్రకటించింది. సిఎం చంద్రబాబు నాయుడు దీనిపై విచారణకు ఆదేశించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
"వైకుంఠ ద్వార సర్వ దర్శన టోకెన్ల జారీ విషయంలో బాధ్యతా రాహిత్యం కనబరిచి భక్తుల మృతికి కారణమయ్యే పరిస్థితులకు ఆస్కారమిచ్చిన డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరనాథరెడ్డిలను సస్పెండ్ చేయడం జరిగింది. టీటీడీ జేఈవో గౌతమి, టీటీడీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్‌తో పాటు ఎస్పీ సుబ్బారాయుడులను బదిలీ చేసాం. అంతేకాదు జరిగిన ఘటనపై జ్యుడీషియల్ ఎంక్వైరీకి కూడా ఆదేశించాం," అని ముఖ్యమంత్రి ప్రకటించారు.
మరో పక్క ప్రతిపక్ష వైసీపీ అధినేత, మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న తిరుపతి రూయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి, సిఎం చంద్రబాబు నాయుడుపై, కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
మాజీ మంత్రి రోజాతో సహా వైసీపీ నేతలు కూడా పోటాపోటీగా విమర్శలు గుప్పిస్తుండటంతో అధికార టీడీపీ, జనసేన, బీజేపిలు కూడా ధీటుగా వారిని తిప్పికొడుతున్నాయి. కనుక ప్రస్తుతం ఏపీలో అధికార-ప్రతిపక్ష వైసీపీ మద్య రాజకీయ యుద్ధం కూడా మొదలైంది.
వైకుంఠ ఏకాదశినాడు స్వామివారిని దర్శించుకోవాలని వచ్చిన భక్తులలో ఆరుగురు చనిపోయారనే బాధ కంటే ప్రజల దృష్టిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టడానికి దీనినో రాజకీయ అవకాశంగా జగన్, వైసీపీ నేతలు భావిస్తుండటం శోచనీయం.