లొట్టిపీసు కేసు కదా.. అర్జెంట్ కాదు

January 09, 2025


img

ఎఫ్-1 రేసింగ్ కేసుని ఓ పనికిమాలిన ‘లొట్టిపీసు కేసు’ అని కేటీఆర్‌ ఎందుకన్నారో కానీ సుప్రీంకోర్టు కూడా అలాగే భావించిన్నట్లుంది. ఈ ‘లొట్టిపీసు కేసు’ని కొట్టివేయాలని కోరుతూ ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌పై తక్షణం విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని చెప్పేసింది. ఈనెల 15న దానిపై విచారణ చేపడుతామని చెప్పింది.

ప్రస్తుతం కేటీఆర్‌ ఏసీబీ కార్యాలయంలో ఉన్నారు. ఈ కేసు గురించి ఏసీబీ అధికారులు ఆయనని ప్రశ్నిస్తున్నారు. 

ఈ కేసులో సుప్రీంకోర్టు కూడా ఆయనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయకపోవడంతో నేడు విచారణ ముగిసిన తర్వాత కేటీఆర్‌ని అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. 

కనుక ముందస్తు జాగ్రత్త చర్యగా ఏసీబీ కార్యాలయం వద్ద, కేటీఆర్‌ నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. బిఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుని గృహ నిర్బంధం చేశారు. 

మరోపక్క ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి అర్వింద్‌ కుమార్‌ని నేడు ఈడీ కార్యాలయంలో అధికారులు ప్రశ్నిస్తున్నారు. నిబందనలకు విరుద్దంగా రూ.45.71 కోట్లు ఎఫ్-1 రేసింగ్ ‘ఈ ఆపరేషన్స్’కు బదిలీ చేయడాన్ని మనీ లాండరింగ్ వ్యవహారంగా ఈడీ భావిస్తోంది. దీని గురించే ఈడీ ఆయనని ప్రశ్నిస్తోంది.

ఇదే కేసులో మరో అధికారి బీఎల్ఎన్‌ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు పంపి విచారించింది. వీరిద్దరి తర్వాత ఈనెల 16న కేటీఆర్‌ని విచారించబోతోంది.


Related Post