ఎఫ్-1 రేసింగ్ కేసులో కేటీఆర్‌కి హైకోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. రేపు ఏసీబీ విచారణకు హాజరైనప్పుడు ఆయన కోరుకున్నట్లుగానే ముగ్గురికి బదులు ఒక న్యాయవాదిని లోనికి అనుమటించేందుకు హైకోర్టు అంగీకరించింది.
అయితే ఆయన పక్కన కాకుండా పక్కనే ఉన్న గదిలో కూర్చోవాలని, మద్యలో ఉండే అద్దం ద్వారా విచారణ జరుగుతున్న తీరుని పరిశీలించవచ్చని చెప్పింది.
విచారణలో తాను చెప్పనివి చెప్పిననట్లుగా ఏసీబీ రికార్డులలో నమోదు చేస్తుందని కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేసినందున సీసీ కెమెరా ఎదుట విచారణ జరపాలని ఆదేశించింది. దానిలో ఆడియో, వీడియోలను కేటీఆర్ లేదా ఆయన తరపు న్యాయవాదులకు ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
ఒకవేళ విచారణపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే హైకోర్టుకి రావచ్చునని సూచించింది. మరికొద్ది సేపటిలో హైకోర్టు తుది తీర్పు వెలువరించనుంది.
విచారణ జరుగుతున్నప్పుడు కేటీఆర్ పక్కనే న్యాయవాదులు లేకపోతే వారు ఏసీబీ కార్యాలయంలో కూర్చున్నా, బయట కూర్చున్నా తేడా ఏమీ ఉండదు. కనుక పక్క గదిలో నుంచి చూస్తూ కూర్చోవడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు.
ఎఫ్-1 రేసింగ్ కేసులో తాను ఎటువంటి తప్పు చేయలేదని, దీనిలో దాచి పెట్టేందుకు ఏమీ లేదని, ఏసీబీ, ఈడీలు ఏం అడిగినా టకటక జవాబులు చెపుతానని కేటీఆర్ నిన్నే చెప్పారు. సిఎం రేవంత్ రెడ్డితో శాసనసభలోనే చర్చకు సిద్దమయ్యానని కానీ ఆయనే భయపడి పారిపోయారని ఎద్దేవా చేశారు. ఆయన నివాసంలోనే మీడియా సమక్షంలో చర్చకు సిద్దమని ప్రగల్భాలు పలికిన కేటీఆర్, న్యాయవాది లేకుండా ఒంటరిగా విచారణకు హాజరు కావడానికి భయపడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది కదా?