ఎఫ్1 రేసింగ్ కేసులో అవినీతి జరిగిన్నట్లు ప్రాధమిక ఆధారాలు ఉన్నాయంటూ క్వాష్ పిటిషన్‌ని హైకోర్టు కొట్టివేయడంతో కేటీఆర్, బిఆర్ఎస్ పార్టీ ఆత్మరక్షణలో పడ్డాయి. హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలతో సమాధానం చెప్పుకోలేని ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది.
నిన్న కోర్టు తీర్పు వెలువడగానే హైదరాబాద్ నంది నగర్‌లో తన నివాసంలో కేటీఆర్, పార్టీ ముఖ్యనేతలు ఎమ్మెల్యేల సమక్షంలో మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేటీఆర్ మళ్ళీ ఎదురుదాడి చేశారు.
ఈ కేసులో అవినీతి జరిగిన్నట్లు ప్రాధమిక సాక్ష్యాధారాలున్నాయని హైకోర్టు స్పష్టంగా చెప్పగా, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తనపై రాజకీయ కక్షతో చేసిన కుట్ర అని, తాను ఎటువంటి తప్పు చేయలేదని, హైదరాబాద్ ప్రతిష్ట ఇనుమడింపజేసేందుకే రేసింగ్ ఈవెంట్ నిర్వహించానని చెప్పుకున్నారు.
కేటీఆర్ పిటిషన్‌ని హైకోర్టు కొట్టివేయడమే కాకుండా సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునేవరకు అరెస్ట్ చేయకుండా బెయిల్ పొడిగించేందుకు తిరస్కరించింది. అంటే ఈ కేసులో కేటీఆర్‌ని అరెస్ట్ చేసుకోవచ్చని స్పష్టం చేసిననట్లే కదా? కానీ తాను నేరం చేశానని, ఈ కేసులో అవినీతి జరిగిందని హైకోర్టు ఎక్కడా చెప్పలేదని కేటీఆర్ వితండవాదం చేశారు.
ఈ కేసుపై కాంగ్రెస్ మంత్రులే తీర్పులు చెపేస్తూ తనకు ఉరి శిక్ష పడినట్లు చాలా సంతోషిస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఈ అక్రమ కేసులపై న్యాయపోరాటం చేసి నిజాయితీ నిరూపించుకుంటానని అన్నారు.
ఈ నెల 9న మళ్ళీ ఏసీబీ విచారణకు, 16న ఈడీ విచారణకు తప్పక హాజరయ్యి వారు అడిగిన ప్రతీ ప్రశ్నకు సమాధానం చెపుతానని, ఈ కేసులో దాచిపెట్టడానికి రహస్యాలు ఏవీ లేవని, చెల్లింపులన్నీ పూర్తి పారదర్శకంగా జరిగాయని కేటీఆర్ అన్నారు.
తాను చట్టాన్ని గౌరవించే పౌరుడిగా ఏసీబీ నోటీస్ ఇవ్వగానే ఆ చట్టంలో ఉన్న హక్కుని వినియోగించుకుంటూ న్యాయవాదిని వెంటబెట్టుకొని విచారణకు వెళ్ళానని, కానీ తమని ఎదుర్కోవడానికి సిఎం రేవంత్ రెడ్డి, ఆయన కనుసన్నలలో పనిచేస్తున్న ఏసీబీ వ్యవస్థలు భయపడ్డాయని కేటీఆర్ అన్నారు. కానీ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరుకాకుండా ఏవిదంగా తప్పించుకున్నారో అందరూ కళ్ళారా చూశారు.
ఈ కేసు గురించి శాసనసభలో చర్చిద్దామంటే రేవంత్ రెడ్డి భయపడ్డారని, జూబ్లీహిల్స్ లో సిఎం నివాసంలోనే మీడియా సమక్షంలో దీనిపై బహిరంగ చర్చకు తాను సిద్దమని కేటీఆర్ సవాలు చేస్తున్నారు. ఈ కేసుపై చర్చలు, వాదోపవాదాలు,తీర్పులు న్యాయస్థానంలో మాత్రమే జరుగుతాయని అక్కడే నిజానిజాలు తేలుతాయని వాదించిన కేటీఆరే, మళ్ళీ ఈవిదంగా వితండవాదం చేస్తుండటం విచిత్రంగా ఉంది.
తెలంగాణలో కాంగ్రెస్‌తో సహా అన్ని రాజకీయ పార్టీలు గ్రీన్ కో కంపెనీ నుంచి ఎలక్టోరల్ బాండ్స్ అందుకున్నప్పుడు, బిఆర్ఎస్ పార్టీని మాత్రమే ఎందుకు తప్పు పడుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. కేటీఆర్ వాదనలలో ఇదొక్కటే సహేతుకంగా కనిపిస్తోంది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలుచేయలేక, ఇటువంటి కేసులతో డైవర్షన్ పాలిటిక్స్ చేసి తప్పించుకోవాలని చూస్తోందని, కానీ తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వాటి గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని కేటీఆర్ అన్నారు. ఎన్నికల హామీలు అమలు వ్యవహారం ప్రజలకు-ప్రభుత్వానికి మద్య వ్యవహారం. ఒకవేళ అధికార పార్టీ తమని మోసం చేసిందని ప్రజలు భావిస్తే దానికి ఎన్నికలలో తగినవిదంగా బుద్ధి చెపుతారు.
ఆలోగా ప్రజల తరపున ప్రతిపక్షాలు తప్పక నిలదీయవచ్చు. కానీ అంత మాత్రాన్న అవి అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడితే వాటిపై కేసులు నమోదు చేయకూడదని, చేస్తే రాజకీయ కక్ష సాధింపు అని అభివర్ణించడం పరిపాటిగా మారింది. ఇందుకు కేటీఆర్ వాదనలే తాజా నిదర్శనం.