ఎఫ్‌-1 రేసింగ్: కేసు కూడా అంతే స్పీడు!

January 07, 2025


img

ఫార్ములా 1 రేసింగ్ అంటే అత్యంత వేగంగా దూసుకుపోయే కార్ల మద్య పోటీ. ఈ కేసు కూడా అంతే వేగంగా దూసుకుపోతోందిప్పుడు. ఈ కేసుని కొట్టేయాలని కోరుతూ కేటీఆర్‌ వేసిన క్వాష్ పిటిషన్‌ని నేడు హైకోర్టు కొట్టివేసింది.

కనుక త్వరలో ఆయన అరెస్ట్‌ అనివార్యంగానే కనిపిస్తోంది. అరెస్ట్‌ కాకుండా ఉండేందుకు ఆయన సుప్రీంకోర్టుని తప్పక ఆశ్రయిస్తే దానిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ కేవీయట్ పిటిషన్‌ వేసిననట్లు తెలుస్తోంది. 

మరోపక్క ఈడీ మళ్ళీ కేటీఆర్‌కి నోటీస్ పంపింది. ఈరోజు ఆయన విచారణకు హాజరుకాలేనని చెప్పడంతో ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని నోటీస్ ఇచ్చింది. ఈ కేసులో లబ్ధి పొందిన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రీన్ కో, దాని అనుబంద సంస్థల కార్యాలయాలలో నేడు ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. 

ఫార్ములా 1 రేసింగ్ ప్రతిపాదన వచ్చినప్పుడే గ్రీన్ కో, దాని ఆరు అనుబంధ కంపెనీలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బిఆర్ఎస్ పార్టీకి రూ.41 కోట్లు చెల్లించిన్నట్లు ఏసీబీ కొత్త విషయం బయటపెట్టడం బిఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

2023 ఫిబ్రవరిలో తొలి రేసింగ్ ఈవెంట్ జరుగగా, బిఆర్ఎస్ పార్టీకి 2022 ఏప్రిల్ 8, అదే ఏడాది అక్టోబర్ 10 వ తేదీలలో రెండు విడతలలో రూ.41 కోట్లు చెల్లించిన్నట్లు ఏసీబీ ఆరోపిస్తోంది. అంటే వాటి నుంచి లంచం ముట్టిన తర్వాత కేటీఆర్‌ వాటికి లబ్ధి కలిగేలా ఈ రేసింగ్ ఈవెంట్ నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారని ఏసీబీ ఆరోపిస్తోంది. 

ఇక రిజర్వ్ బ్యాంక్, ఫెమా నిబందనలకు విరుద్దంగా రూ.46 కోట్లు బ్రిటన్ పౌండ్ల రూపంలో విదేశంలో నిర్వహణ కంపెనీకి బదిలీ చేశారనేది మరో ప్రధాన ఆరోపణ. కనుక ఈ రెండు ఆర్ధిక నేరాలేనని ఏసీబీ, ఈడీ భావిస్తూ వేగంగా పావులు కదుపుతున్నాయి.

కానీ కేటీఆర్‌ తాను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని, తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న సిఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఇంతకు ఇంతా తిరిగి ప్రతీకారం తీర్చుకుంటానని చెపుతున్నారు. 


Related Post