ఏపీకి మరో 7 విమానాశ్రయాలు.. మరి తెలంగాణకి?

January 04, 2025


img

పొరుగు రాష్ట్రం ఏపీతో పోలిస్తే తెలంగాణ అన్ని విధాలుగా చాలా అభివృద్ధి చెందింది. చాలా ముందుంది. అయితే ఇప్పుడు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు శరవేగంగా ఏపీని అన్ని రంగాలలో అభివృధ్ది చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు చూస్తున్నప్పుడు, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనకబడిపోయిందా? అనే అనుమానం కలుగకమానదు. 

ఎంతగానో అభివృద్ధి చెందిన తెలంగాణలో నేటికీ ఓకే ఒక్క విమానాశ్రయం (శంషాబాద్) ఉండగా, ఏపీలో 5 ఉన్నాయి. కొత్తగా విశాఖ సమీపంలో భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇవికాక కొత్తగా మరో 7 విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారు. 

ఇప్పుడు ఆయన ఎన్డీయేలో కీలకపాత్ర పోషిస్తుండటం, టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉండటంతో మరో 7 విమానాశ్రయాలు ఏర్పాటుకి చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. 

శ్రీకాకుళం, తుని, అన్నవరం, ఒంగోలు, తాడేపల్లిగూడెం, కుప్పం, నాగార్జున సాగర్ వద్ద విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. 

ఇప్పటికే శ్రీకాకుళం వద్ద దగదర్తిలో 635 ఎకరాలు భూసేకరణ చేసి మరో 700 ఎకరాలు సేకరిస్తోంది. మిగిలిన చోట్ల కూడా ఇందుకు సన్నాహాలు చేస్తోంది. 

ఏపీకి ఇప్పటికే 5 విమానాశ్రయాలున్నాయి కదా ఇంకా మరో ఏడు దేనికంటే ఆయా ప్రాంతాలలో భారీ పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయి గనుక. అంటే ఏపీలో విమానాశ్రేయాలతో పాటు భారీ సంఖ్యలో పరిశ్రమలు కూడా ఏర్పాటు కాబోతున్నాయన్న మాట. 

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి వరంగల్ విమానాశ్రయం గురించి బిఆర్ఎస్, కాంగ్రెస్‌ నాయకులు చెప్పే మాటలు వింటూనే ఉన్నాము. ప్రభుత్వాలు మారినా వరంగల్ విమానాశ్రయం ఏర్పాటులో అడుగు ముందుకు పడటం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు నత్త నడకన సాగుతోంది. 

హైదరాబాద్‌ నగరానికి అతిసమీపంలో ఉన్న వరంగలలోనే ఓ విమానాశ్రయం  ఏర్పాటు చేసుకోలేనప్పుడు వేరే జిల్లాలలో ఏర్పాటు చేయడం సాధ్యమేనా?

 తెలంగాణ రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ ఇద్దరు కేంద్ర మంత్రులున్నారు. వారికి సహచర మంత్రి  రామ్మోహన్ నాయుడుతో సత్సంబంధాలు కూడా ఉన్నాయి. సిఎం రేవంత్ రెడ్డి కూడా ప్రధాని మోడీతో సఖ్యతగా ఉంటున్నారు. 

ఇంత మంది ఉన్నా తెలంగాణకు కొత్తగా ఒక్క విమానాశ్రయం కూడా ఎందుకు సాధించలేకపోతున్నారు? సిఎం చంద్రబాబు నాయుడు ఒక్కరే ఇవన్నీ ఎలా సాధించుకుంటున్నారు?   


Related Post