పేదలపైనే హైడ్రా ప్రతాపం?

January 01, 2025


img

హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేస్తున్నా ఏ మాత్రం వెనక్కు తగ్గకపోవడం విస్మయం కలిగిస్తుంది. ఖాజాగూడాలోని బ్రహ్మనికుంటలో ఆక్రమణలు తొలగించింది. 

నగరంలో అందరూ నిన్న రాత్రి న్యూఇయర్ వేడుకలు జరుపుకుంటుంటే, ఇళ్ళు కోల్పోయిన ఆ నిరుపేద కుటుంబాలు తమ ఇంట్లో వస్తువులను రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై పెట్టుకొని చలికి గజగజవణుకుతూ రాత్రంతా అక్కడే గడపాల్సి వచ్చింది. ఆ దారిన పోయేవారు వారిని, వారి పిల్లల దుస్థితిని చూసి జాలిపడుతున్నారు. కానీ ఎవరూ ఏమీ చేయలేని నిసహాయత. 

రాజకీయ నాయకుల ఫామ్‌హౌస్‌ల జోలికి వెళ్ళేందుకు సాహసించలేకపోతున్న హైడ్రా పేదలపై ఈవిదంగా తన ప్రతాపం చూపడటం సమంజసమేనా?హైడ్రా చర్యలతో ప్రభుత్వానికి అప్రదిష్ట, ప్రజలలో వ్యతిరేకత ఏర్పడదా? ఏర్పడినా పర్వాలేదని హైడ్రా, ప్రభుత్వం భావిస్తున్నాయా?అవే ఆలోచించుకోవలసి ఉంటుంది. 

ఖాజాగూడాలో హైడ్రా కూల్చివేతలపై దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు జస్టిస్ కే లక్ష్మణ్ హైడ్రా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నోటీసులు జారీ చేసిన 24 గంటలలోనే ఇళ్ళు కూల్చివేయడాన్ని తప్పు పట్టారు. అవి ఆక్రమణలే అయినప్పటికీ వాటిలో పేద ప్రజలు నివశిస్తున్నారని, వారికీ చట్ట ప్రకారం కొన్ని ప్రాధమిక హక్కులు ఉంటాయని, వాటిని గౌరవించాలని హైడ్రా అధికారులకు తెలియదా?వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించి తమ వాదనలు వినిపించేందుకు అవకాశం ఎందుకు ఇవ్వలేదు? అని  జస్టిస్ కే లక్ష్మణ్ హైడ్రా తరపు న్యాయవాదిని నిలదీశారు. 

ఇప్పటికే రెండుమూడు సార్లు హెచ్చరించామని మరొకసారి ఈవిదంగా చేస్తే హైడ్రా కమీషనర్ రంగనాద్‌ని కోర్టుకి పిలిపించాల్సి వస్తుందని హెచ్చరించారు. హైకోర్టు హెచ్చరికలతో హైడ్రా వెనక్కు తగ్గవచ్చు. కానీ రోడ్డున పడిన ఆ నిరుపేదలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కదా?


Related Post