సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్, సినీ పరిశ్రమ తీరు గురించి భిన్నాభిప్రాయలు వ్యక్తం అయ్యాయి. తెలంగాణలో ప్రతిపక్షపార్టీలు ఈ అంశంపై కూడా రాజకీయ మైలేజ్ కోసం ప్రయత్నిస్తూ సిఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించాయి. అందరూ ఏదో ఓ కోణంలో నుంచే ఈ సమస్యని చూసి అభిప్రాయాలు చెప్పారు తప్ప తమ్మారెడ్డి భదరద్వాజలా నిష్పక్షపాతంగా మాట్లాడినవారు చాలా కొద్ది మందే ఉన్నారు.
అటువంటి వారిలో ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. ఆయన నిన్న మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “ సాక్షాత్ ఆ దేవుడే భక్తులు పొగడ్తలు కోరుకుంటాడు. సినీ నటులు కోరుకోరా?మా అన్నయ్య చిరంజీవి సైతం అభిమానులతో కలిసి సినిమాలు చూసి ఆనందించేవారు. అల్లు అర్జున్ కూడా అదే చేశారు.
అయితే కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. కనీసం సంధ్య థియేటర్ వద్ద అ ఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ టీమ్ మానవతా దృక్పదంతో స్పందించి ఉంటే ఇంత రాద్దాంతం జరిగి ఉండేదే కాదు. గోటితో పోయేదానిని గొడ్డలి వరకు తెచ్చుకున్నారని నేను భావిస్తున్నాను.
ఒకవేళ రేవంత్ రెడ్డి స్థానంలో నేనున్నా అదే చేస్తాను. ఓ ముఖ్యమంత్రిగా ఆయన చట్ట ప్రకారమే వ్యవహరించారు. కనుక దీనిని రాజకీయ కోణంలో చూడరాదు. పుష్ప-2తో సహా అన్ని పెద్ద సినిమాలకు తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో సహకరించింది. ఇక ముందు కూడా సహకరిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు కదా?
సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి అక్కడ తెలంగాణ ప్రభుత్వం, ఇక్కడ ఏపీ ప్రభుత్వం రెండూ సహకరించడానికి సిద్దంగా ఉన్నాయి. కనుక సినీ పరిశ్రమలో వారు కూడా బేధాభిప్రాయలు, బేషజాలు పక్కన పెట్టి అందరూ కలిసి కట్టుగా పనిచేయాలి,” అని పవన్ కళ్యాణ్ హితవు పలికారు.
తన నటనను ప్రేక్షకులు మెచ్చుకుంటే చూడాలని ప్రతీ నటుడు కోరుకుంటారు, జరిగిన ఘటనలో అల్లు అర్జున్ ఒక్కడిదే తప్పు అనడం సరికాదు, మూవీ టీమ్ సమయానికి స్పందించి ఉంటే ఇంత పెద్ద గొడవ అయ్యేది కాదు - ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారు pic.twitter.com/LwJd3hqCZ7