వచ్చే నెల 10న సంక్రాంతి పండుగ సందర్భంగా రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్‌లో గేమ్ చేంజర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కనుక రామ్ చరణ్ అభిమానులు విజయవాడ బృందావనం కాలనీలో వజ్రా మైదానంలో 250 అడుగుల ఎత్తైన రామ్ చరణ్ కటవుట్ ఏర్పాటు చేస్తున్నారు. టిఎఫ్‌డీసీ ఛైర్మన్, ప్రముఖ సినీ నిర్మాత దిల్‌రాజు ఈ కటవుట్ ఆవిష్కరించనున్నారు. దేశంలో తొలిసారిగా విజయవాడలో ఇంత పెద్ద కటవుట్ ఏర్పాటు చేస్తున్నామని రామ్ చరణ్ అభిమానులు చెప్పారు.
దిల్‌రాజు కటవుట్ ఆవిష్కరించిన తర్వాత హెలికాఫ్టర్ ద్వారా పూలవర్షం కురిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అభిమానులు చెప్పారు. ఇప్పటికే వజ్రా మైదానంలో కటవుట్‌ని బిగించేందుకు కర్రలతో 250 అడుగుల ఎత్తున కర్రలతో ఫ్రేమ్ సిద్దమైంది. ఈరోజు సాయంత్రంలోగా దానికి కటవుట్ బిగిస్తామని రామ్ చరణ్ అభిమానులు చెప్పారు.
రామ్ చరణ్‌పై తమ అభిమానం చాటుకునేందుకు ఈవిదంగా చేయడం వారికి చాలా గొప్ప విషయంగా అనిపించవచ్చు. కానీ ఇటువంటి ఆలోచనలు, ప్రయత్నాలే ఊహించని సమస్యలు, ప్రమాదాలు తెచ్చిపెడుతుంటాయి. సంధ్య థియేటర్ వద్ద అభిమానుల అత్యుత్సాహమే వారి అభిమాన హీరో అల్లు అర్జున్‌కి ఎన్ని కష్టాలు, సమస్యలు, అవమానాలు తెచ్చిపెట్టిందో అందరూ చూస్తూనే ఉన్నారు కదా?కనుక ఇటువంటి పనులు అవసరమా? ఆలోచిస్తే మంచి.
పుష్ప-2 కలెక్షన్స్ రికార్డుల మారుమ్రోగిపోతుంటే, రామ్ చరణ్ అభిమానులు కూడా తమ అభిమాన హీరో సినిమా గేమ్ చేంజర్ దానికి మించే ఉండాలని, ఉంటుందని ఆశించడం సహజం. గేమ్ చేంజర్ సూపర్ హిట్ అవ్వాలనే ప్రతీ సినీ అభిమాని కోరుకుంటాడు కూడా. కానీ ఒకవేళ గేమ్ చేంజర్‌కి మిశ్రమ స్పందన వచ్చి కలెక్షన్స్ టార్గెట్ సాధించలేకపోయినా, బోర్లా పడినా దాని కోసం ఇంత హడావుడి చేసినందుకు వారే నవ్వులపాలవుతారు కదా?