టాలీవుడ్‌కి షాక్ ట్రీట్‌మెంట్‌ అవసరమే?

December 26, 2024


img

అల్లు అర్జున్‌ వ్యవహారంలో టాలీవుడ్‌ ఏవిదంగా స్పందించిందో అందరూ చూశారు. శాసనసభలో సిఎం రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ తప్పొప్పులను ఎత్తి చూపించి విమర్శిస్తే వాటిపై సినీ పరిశ్రమ పెద్దలు ఆత్మవిమర్శ చేసుకున్నారో లేదో తెలీదు కానీ అల్లు అర్జున్‌ మాత్రం చేసుకోకుండానే ప్రెస్‌మీట్‌ పెట్టి సిఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చేశారు. దీంతో సినీ పరిశ్రమ మొత్తం ఆత్మరక్షణలో పడింది. 

అయితే వారి అదృష్టం కొద్దీ దిల్‌రాజు టీఎఫ్‌డీ ఛైర్మన్‌గా నియామితులయ్యారు. కనుక ఆయన చొరవ తీసుకొని సిఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి ఈరోజు భేటీ ఏర్పాటు చేశారు. 

కనుక అందరూ సిఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చాలు ఇచ్చి, శాలువాలు కప్పి, పొగిడేసి ప్రసన్నం చేసుకుందామని అనుకుంటే ఆయన వారందరికీ షాక్ ఇచ్చారు.            

సంధ్య థియేటర్‌ ఘటన వల్లనే తాను అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేయించాను తప్ప టాలీవుడ్‌పై ఎటువంటి కక్ష లేదని స్పష్టం చేశారు. సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట వీడియోని, థియేటర్‌లో నుంచి అల్లు అర్జున్‌ని పోలీసులు బయటకు తీసుకువస్తున్న సీసీ టీవీ ఫుటేజీలను వారికి చూపించి నిలదీయడమే కాకుండా ఈ విషయంలో వారి ధోరణి సరిగా లేదని మొహం మీదనే చెప్పేసిన్నట్లు తెలుస్తోంది.  

తాను శాసనసభలో చెప్పిన మాటలకు నేటికీ కట్టుబడి ఉంటానని చెపుతూ, ఇకపై తెలంగాణలో ప్రివిలేజ్ షోలు, బెనిఫిట్ షోలను అనుమతించబోమని, అలాగే టికెట్స్ రేట్స్ పెంచుకునేందుకు కూడా అనుమతించబోమని సిఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పేశారు. 

ఇకపై బౌన్సర్స్ ఏమాత్రం అతి చేసినా వారిపై, వారి సేవలు ఉపయోగించుకుంటున్న నటీనటులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సిఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. 

రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం, అలాగే తమ ప్రభుత్వం అమలుచేస్తున్న వివిద అభివృద్ధి, సంక్షేమ పధకాలను వివరిస్తూ సినీ నటీనటులతో ప్రకటనలు రూపొందించి, సినిమా ప్రదర్శనకు ముందు ప్రదర్శించాలని సిఎం రేవంత్ రెడ్డి షరతు కూడా విధించారు. 

తమని చిర్నవ్వుతో చాలా ఆప్యాయంగా పలకరించిన సిఎం రేవంత్ రెడ్డి, ఇంత కటువుగా వ్యవహరిస్తారని ఊహించని సినీ ప్రముఖులు షాక్ అయ్యుంటారని వేరే చెప్పక్కరలేదు. కానీ సినీ పరిశ్రమకు ఇటువంటి షాక్ ట్రీట్‌మెంట్‌ అవసరమే అనిపిస్తుంది. 

అభిమానులు దేవుళ్ళు వారి వలననే ఈ స్థాయిలో ఉన్నామని చెపుతూనే వారినే నిలువుదోపిడీ చేస్తున్నారు. పైగా ప్రజలను, ముఖ్యంగా అభిమానులతో వారి బౌన్సర్లు చాలా దురుసుగా వ్యవహరిస్తుంటారు. 

సినీ పరిశ్రమ అంటే కేవలం పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతలు, పెద్ద దర్శకులు మాత్రమే కాదు చిన్న సినిమాలు, హీరోలు, నిర్మాతలు, దర్శకులు కూడా అనే భావన టాలీవుడ్‌ పెద్దలలో ఎన్నడూ కనబడదు. 

సినీ పరిశ్రమలో వారినే పెద్దలు పట్టించుకోనప్పుడు, దెబ్బ తీస్తున్నప్పుడు వారిని ప్రభుత్వం మాత్రం ఎందుకు పట్టించుకోవాలి? కనుక టాలీవుడ్‌ పెద్దలతో సిఎం రేవంత్ రెడ్డి సరిగ్గానే వ్యవహరించారని భావించవచ్చు. 


Related Post