కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన కాళేశ్వరం ప్రాజెక్టుతోనే ఆయనని, బిఆర్ఎస్ పార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెదుతోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ విచారణతో దానిలో జరిగిన అక్రమాలు, అవినీతి, అవకతవకలు, సాంకేతిక లోపాలు, విధానపరమైన తప్పదు నిర్ణయాలు.. ఇలా ప్రతీ అంశాన్ని కమీషన్ విచారణ జరిపి నిగ్గు తేలుస్తోంది. అది విచారణ పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని కాంగ్రెస్ మంత్రులు చెపుతున్నారు.
అయితే బిఆర్ఎస్ పార్టీ కూడా అదే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. తాజాగా యాసంగి 2024-2025లకు సాగునీటి విడుదల షెడ్యూల్ సోషల్ మీడియాలో ప్రభుత్వం విడుదల చేసింది. బిఆర్ఎస్ పార్టీ దానిపై స్పందిస్తూ ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు సందించింది. అవేమిటో దాని మాటల్లోనే..
కాళేశ్వరం కట్టుడు అయింది .. కూలుడు అయింది అని విషప్రచారం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ కూల్చిన కాళేశ్వరం నుండి 73,070 ఎకరాలకు ఈ యాసంగి పంటకు సాగునీరు ఇస్తున్నట్లు ప్రకటనలు జారీచేశారు. మరి ప్రపంచానికే తలమానికం అయిన కాళేశ్వరం ఎత్తిపోతల మీద కాంగ్రెస్ కారుకూతలు ఎందుకు కూసినట్లు? విచారణ పేరుతో కమిటీ వేసి ఏడాది కాలంగా మరమ్మతులను ఎందుకు అడ్డుకుంటున్నట్లు?
కాళేశ్వరం మీద కక్ష్యగట్టి రైతుల పొలాలకు సాగు నీరందకుండా చేస్తున్నారు. గోదావరి నీళ్లను సముద్రం పాలు చేస్తున్నారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పడావు పెట్టారు. కృష్ణా నీళ్లను మలుచుకుని అందుబాటులో ఉన్న రిజర్వాయర్లను నింపుకునే అవకాశం ఉన్నా ఉద్దేశపూర్వకంగా పనులను పక్కనపెట్టారు.
కాంగ్రెస్ కుట్రలు ఆపకుంటే ఈ రైతుల కన్నీళ్లే ఈ ప్రభుత్వ సమాధికి పునాదులు అవుతాయి ఈ రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో విసిరేసే సమయం వస్తుంది జాగో తెలంగాణ జాగో,” అని బిఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది.