మాజీ సిఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు హైకోర్టులో ఊరట లభించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో విచారణకు హాజరు కావాలంటూ వారికిచ్చిన నోటీసులను హైకోర్టు కొట్టివేసింది.
మేడిగడ్డ బ్యారేజ్‌లో మూడు పిల్లర్లు క్రుంగిపోయినందుకు మాజీ సిఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు బాధ్యులని ఆరోపిస్తూ రాజలింగమూర్తి అనే న్యాయవాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు.
ఆ కేసులో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపగా వారిరువురూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. నేడు దానిపై విచారణ జరిపిన హైకోర్టు, జిల్లా కోర్టు ఆదేశాలు సబబుగా లేవంటూ కొట్టివేసింది. ఈ కేసు తదుపరి విచారణని జనవరి 7కి వాయిదా వేసింది.
ఈ కేసులో కేసీఆర్, హరీష్ రావులకు ఊరట లభించినప్పటికీ ఇది తాత్కాలికమే అని చెపొచ్చు. తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ చేత కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవక తవకలపై చాలలోతుగా విచారణ జరిపిస్తోంది.
విచారణకు హాజరైన ఉన్నతాధికారులు అందరూ తమ ప్రమేయం లేకుండా కేసీఆర్ స్థాయిలోనే అన్ని నిర్ణయాలు జరిగేవని చెపుతున్నారు. కనుక కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ మొదలైతే, కేసీఆర్, హరీష్ రావులతో సహా దానితో సంబంధం ఉన్న ఎవరూ తప్పించుకోలేరు.