అల్లు అర్జున్‌ నైతిక బాధ్యత వహించి ఉంటే...

December 22, 2024


img

తమ్మారెడ్డి భరద్వాజ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ టాలీవుడ్‌కి దూరంగా లేరు. సినీ పరిశ్రమలో అపారమైన అనుభవం ఉన్న ఆయన వివిద అంశాలు, సమస్యలపై తన అభిప్రాయలు సూటిగా చెపుతుంటారు. అల్లు అర్జున్‌ అరెస్ట్‌ తదనంతర పరిణామాలపై తాజా ఇంటర్వ్యూలో తన అభిప్రాయలు చెప్పారు. 

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనకు పోలీసులు, అల్లు అర్జున్‌, థియేటర్‌ యాజమాన్యం, అభిమానులు అందరూ బాధ్యులే. అయితే అల్లు అర్జున్‌ అక్కడికి రావడం వల్లనే ఈ ఘటన జరిగింది కనుక ఆయన నైతిక బాధ్యత తీసుకొని ఉంటే గౌరవంగా ఉండేదని అన్నారు. 

ఈ కేసులో ఆయన అరెస్ట్‌ అయినా కోర్టు కూడా అన్నిటినీ పరిశీలించి ఆయనకు బెయిల్‌ మంజూరు చేసి ఉండేదని కానీ అల్లు అర్జున్‌ తొందరపాటుతో వ్యవహరించారని అభిప్రాయ పడ్డారు. 

రేవంత్ రెడ్డి అహం దెబ్బ తినడం వలననే అల్లు అర్జున్‌ అరెస్ట్‌ చేయించారనడం సరికాదన్నారు. ముఖ్యమంత్రికి చిన్న చిన్న విషయాలు పట్టించుకునేంత సమయం ఉండదని కనుక ఈ ఘటనపై సిఎం రేవంత్ రెడ్డి చట్టప్రకారమే వ్యవహరించారన్నారు. 

ఒకవేళ అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేయకపోయినా, ఆయన బెయిల్‌ పిటిషన్‌ని పై కోర్టులో సవాలు చేయకపోయినా అందరూ ప్రభుత్వం అమ్ముడుపోయిందని ఆరోపిస్తారని అన్నారు. 

ఈ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌ ధోరణి సరికాదన్నారు. ఒకవేళ వారి ప్రభుత్వమే ఉండి, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఘటన జరిగితే ఏం చేసేవారని ప్రశ్నించారు. కేటీఆర్‌ చాలా బాధ్యతారహితంగా మాట్లాడారని తమ్మారెడ్డి అన్నారు.  

అలాగే అల్లు అర్జున్‌ అరెస్ట్‌ చేసేటప్పుడు పోలీసులు కాస్త అతి చేశారని, వారు ఫోన్ చేసి చెప్తే ఆయనే వచ్చి లొంగిపోయేవారని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. టాలీవుడ్‌ ప్రముఖులు అల్లు అర్జున్‌ని పరామర్శించడాన్ని తప్పు పట్టలేమని, ఓ కుటుంబంలో ఎవరికైనా కష్టం వస్తే అందరూ ఎలా స్పందిస్తారో టాలీవుడ్‌ కూడా అలాగే స్పందించింది తప్ప అంతకు మించి వారికి వేరే ఉద్దేశ్యం లేదని తమ్మారెడ్డి అన్నారు. కనుక ప్రభుత్వం కూడా వారి సంఘీభావాన్ని వేరేగా స్వీకరించకూడదని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. 


Related Post