అల్లు అర్జున్ శనివారం రాత్రి ప్రెస్‌మీట్ పెట్టి సంధ్య థియేటర్ ఘటనలో తన తప్పేమీ లేకపోయినా అందరూ తననే నిందిస్తున్నారని, అది తనకు చాలా బాధ కలిగిస్తోందన్నారు. ఆరోజు తాను పోలీసులు, తన సిబ్బంది సూచన మేరకే కారులో నుంచి పైకి వచ్చి అభిమానులకు అభివాదం చేశాను తప్ప ఊరేగింపు నిర్వహించలేదన్నారు.
థియేటర్‌లో అభిమానులతో కలిసి సినిమా చూస్తున్నప్పుడు పోలీసులు ఎవరూ తన వద్దకు రాలేదని, వచ్చి బయట జరిగిన ఘటన గురించి చెప్పలేదని, ఆ ఘటన గురించి తెలియకపోయినా సిబ్బంది సూచన మేరకు సినిమా మద్యలో పిల్లలని థియేటర్‌లోనే వదిలేసి ఇంటికి చేరుకున్నానని చెప్పారు. ఆ ఘటన గురించి మర్నాడు ఉదయం వరకు తనకు తెలియదన్నారు.
తన సినిమా చూసేందుకు వచ్చిన ఓ అభిమాని ప్రాణాలు కోల్పోవడం, మరొక చిన్నారి కోమాలోకి వెళ్ళిపోవడం తనకు బాధ కలిగించాయని అల్లు అర్జున్ చెప్పిన మాటలు అక్షరాల నిజమే. కానీ థియేటర్‌కి వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్లిపోయే వరకు జరిగిన పరిణామాల గురించి ఆయన చెప్పిన మాటలు నమ్మశక్యంగా లేవు.
ముఖ్యంగా ఆయన థియేటర్‌లో ఉన్నప్పుడు బయట తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందిన విషయం, అపస్మారక స్థితిలో బాలుడుని ఆస్పత్రికి తరలించిన విషయం తనకు తెలియదని అల్లు అర్జున్ చెప్పడం అసలే నమ్మశక్యంగా లేవు. అంత మంది బౌన్సర్లు, సిబ్బంది, అభిమానులలో ఏ ఒక్కరూ ఆయనకు ఈవిషయాలు చెప్పకుండా ఉంటారా?
బహుశః అందుకే ఆయన మద్యలో వెళ్ళిపోయి ఉండవచ్చు. ఒకవేళ వారు చెప్పకపోయినా అక్కడ జరిగిన ఈ ఘటనల గురించి అన్ని టీవీ ఛానల్స్‌లో వార్తలు వస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి కదా? కనుక ఈ విషయంలో అల్లు అర్జున్ అబద్దం చెప్పారని అనుమానించక తప్పదు. బహుశః న్యాయ నిపుణుల సలహా మేరకు ఆవిదంగా చెప్పి ఉండొచ్చు.
“దేశవ్యాప్తంగా పుష్ప-2 సినిమా విజయోత్సవాలకు ఆహ్వానాలు వస్తున్నా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలతో కలత చెంది అన్నిటినీ వదులుకొని ఇంట్లో ఉండిపోయాను,” అని అల్లు అర్జున్ చెప్పుకోవడం కూడా నమ్మశక్యంగా లేదు.
ఎందువల్ల అంటే ఆయన అరెస్ట్ వార్త దేశవ్యాప్తంగా ‘వైల్డ్ ఫైర్’లాగే వ్యాపించింది. అరెస్ట్ పట్ల దేశ ప్రజలలో ఆయన పట్ల సానుభూతి ఏర్పడి ఉండవచ్చు. కానీ అంత మాత్రాన్న ఆయన ఎక్కడికి వెళ్ళినా మీడియా కాకుల్లా పొడవకుండా విడిచిపెట్టదు. ఇంకా మసాలా కధనాలు వండి వడ్డించకుండా ఉండదు.
కనుక ఈ వేడి తగ్గేవరకు మీడియాకు దూరంగా ఉండటమే మంచిదనుకోని పుష్ప-2 ఫంక్షన్స్‌కి వెళ్ళకపోయి ఉండొచ్చు. కానీ నిన్న ఆయనంతట ఆయనే మీడియాని పిలిచి మాట్లాడారు. మీడియాకి మళ్ళీ పని కల్పించారు కదా?