పుష్ప-2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన విషాద ఘటనపై సిఎం రేవంత్ రెడ్డి నిన్న శాసనసభలో అల్లు అర్జున్, సినీ ప్రముఖులందరిపై నిప్పులు చెరిగారు. తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయి, ఆమె కుమారుడు కోమాలో ఉంటే సినీ ప్రముఖులు ఎవరూ పట్టించుకోరా? అల్లు అర్జున్‌కు కాలు విరిగిందా.. చెయ్యి విరిగిందా?పరామర్శించడానికి అందరూ ఆయన ఇంటికి క్యూ కట్టారు?” అంటూ సిఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.
సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నలపై సినీ పరిశ్రమ ఏవిదంగా స్వీకరించిందో, ఏవిదంగా స్పందిస్తుందో ఇంకా తెలియవలసి ఉంది. కానీ వారి విమర్శలకు అల్లు అర్జున్ మనోభావాలు దెబ్బ తిన్నాయి. సిఎం, మంత్రులు పేర్లు ప్రస్తావించకుండానే అల్లు అర్జున్ అదే విషయం శనివారం రాత్రి ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పారు.
అల్లు అర్జున్ ముందుగా రేవతి మృతి పట్ల సంతాపం తెలిపి, ఆ ఘటనకు తాను చాలా బాధపడుతున్నానని చెప్పారు.
తాను అభిమానులను వినోదింపజింపజేసి వారు సంతోషంగా ఉంటే చూడాలని అనుకుంటానని అటువంటప్పుడు సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు తాను బాధ పడకుండా ఉన్నానని ఎలా అనుకున్నారని ప్రశ్నించారు.
తన సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి, అభిమానులతో కలిసి ఘనంగా విజయోత్సవాలు జరుపుకోవలసి ఈ సమయంలో అన్ని ఫంక్షన్స్ రద్దు చేసుకొని గత 15 రోజులుగా తన ఇంట్లో తాను బందీగా ఉండిపోయానని అల్లు అర్జున్ చెప్పారు.
సంధ్య థియేటర్ వద్ద భారీ సంఖ్యలో అభిమానులు గుమిగూడటంతో పోలీసులు, తన సిబ్బంది సూచన మేరకే తాను కారులో నుంచి పైకి వచ్చి అందరికీ అభివాదం చేసి ముందుకు సాగాలని చెప్పానని కానీ దానినే ఊరేగింపు అని అభివర్ణించడం తనను చాలా బాధించిందని అన్నారు.
ఆరోజు సంధ్య థియేటర్‌లో తన అభిమానులు, పిల్లలతో కలిసి పుష్ప-2 సినిమా చూస్తున్నప్పుడు, ఏ పోలీస్ అధికారి లోనికి వచ్చి తనని కలిసి బయట జరిగిన ఘటన గురించి చెప్పలేదని అల్లు అర్జున్ స్పష్టం చేశారు.
తన సిబ్బందిలో ఒకరు వచ్చి మీరు వెంటనే ఇంటికి తిరిగి బయలుదేరాకపోతే థియేటర్ వద్ద అభిమానులను నియంత్రించడం కష్టమని చెప్పడంతో, థియేటర్‌లో సినిమా చూస్తున్న తన ఇద్దరి పిల్లలని వదిలేసి మద్యలో ఇంటికి తిరిగి వెళ్లిపోయానని చెప్పారు.
ఈ ఘటన జరిగిన్నట్లు తెలిసి ఉంటే ధియేటర్లో తన ఇద్దరి పిల్లలని వదిలేసి వెళ్ళేవాడినా?అని ప్రశ్నించారు. సంధ్య థియేటర్ బయట జరిగిన ఘటన గురించి మర్నాడు ఉదయం వార్తలు చూసినప్పుడే తనకు తెలిసిందని, అంత వరకు ఆ విషయం తనకు తెలియలేదని అల్లు అర్జున్ చెప్పారు.
ఆ ఘటనపై తాను చాలా బాధపడ్డానని, వెంటనే తాను లేదా తన తండ్రి లేదా మారెవరైనా ఆస్పత్రికి వెళ్ళి పరిస్థితి తెలుసుకోవాలని అనుకున్నామని కానీ అప్పటికే తనపై పోలీస్ కేసు నమోదు అయినందున ఎవరూ అక్కడికి వెళ్ళడం మంచిది కాదని సలహా మేరకు ఆగిపోయామని అల్లు అర్జున్ చెప్పారు.
ఆ తర్వాత ఎప్పటికప్పుడు ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి సమాచారం తెలుసుకుంటూనే ఉన్నామని, అతనికి, కుటుంబానికి అండగా నిలబడతామని చెపుతూనే ఉన్నామని చెప్పారు. తాను ఇంత బాధ్యతగా వ్యవహరిస్తుంటే తన వ్యక్తిత్వాన్ని, మనోభావాలను దెబ్బ తీసే విదంగా కొందరు మాట్లాడుతుండటం చాలా బాధ కలుగుతోందని అల్లు అర్జున్ అన్నారు.
ఈ ఘటన, తదనంతర పరిణామాలపై వివరణ ఇచ్చుకొని తన బాధను వ్యక్తం చేయడానికే ప్రెస్‌మీట్ పెట్టాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉన్నందున తాను ఇప్పుడు ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా అది మరో సమస్యగా మారుతుంది కనుక ఇంతటితో ముగిస్తున్నానని అల్లు అర్జున్ చెప్పారు.