బిఆర్ఎస్ పార్టీకి ఓ ధర్మ సందేహం కలిగింది. ఫార్ములా1 రేసింగ్ కుంభకోణంలో తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంటే మద్యలో ఈడీకి ఎందుకు ఇంత ఆసక్తి కలిగింది? ఎందుకు ఇంత అత్యుత్సాహం? మూడు నెలల క్రితం పొంగులేటి ఇంటి మీద దాడులు చేసిన ఈడీ ఇంతవరకు వివరాలు ఎందుకు వెల్లడించలేదు? అని సోషల్ మీడియాలో ధర్మ సందేహం బయట పెట్టింది.
మళ్ళీ దానికి సమాధానం కూడా బిఆర్ఎస్ పార్టీయే చెప్పింది. ఎందుకంటే కాంగ్రెస్, బీజేపిలు తెలంగాణలో మిత్రులు, ఢిల్లీలో శత్రువులుగా నటిస్తుంటారని చెప్పింది.
అంతేకాదు.. రేవంత్ రెడ్డిపై రాహుల్ గాంధీకి నియంత్రణ లేదేమో? అందుకే ఆయన వ్యతిరేకిస్తున్న అదానీతో రేవంత్ రెడ్డి అంటకాగుతున్నా పట్టించుకోవడం లేదేమో? అదానీ-రేవంత్ రెడ్డి విషయంలో జోక్యం చేసుకోవడానికి, మాట్లాడేందుకు రాహుల్ గాంధీకి అనుమతి లేదేమో? ఇది తెలంగాణ కాంగ్రెస్ పార్టీతో చేసుకున్న అంతర్గత ఒప్పందమేమో?
ఎఫ్1 రేసింగ్ వ్యవహారం శాసనసభలో ఎందుకు మాట్లాడనీయలేదు? అంటూ బిఆర్ఎస్ పార్టీ అనేక ధర్మ సందేహాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఈ ధర్మ సందేహాలకు కాంగ్రెస్ పార్టీ లేదా సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది.
ఏసీబీ కేసు నుంచి మహా అయితే రెండు నెలల్లో బయటకు వచ్చేస్తానని కేటీఆర్ స్వయంగా చెప్పుకున్నారు. కానీ ఈడీ పట్టుకుంటే విడిపించుకు బయటపడటానికి కనీసం ఆరు నెలలు పడుతుందని బిఆర్ఎస్ పార్టీకి అనుభవపూర్వకంగా తెలిసింది. కనుక ఈ ఆందోళన అంతా దాని గురించేనేమో?