హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలో 100 అడుగుల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు సిఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.
ఎన్టీఆర్ కుమారుడు మోహనకృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఛైర్మన్ టీడీ జనార్ధన్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో గురువారం సిఎం రేవంత్ రెడ్డిని శాసనసభలో ఆయన ఛాంబర్‌లో కలిశారు.
అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలో స్థలం కేటాయించిన్నట్లయితే అక్కడ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. తమ ప్రతిపాదనపట్ల సిఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని నందమూరి మోహనకృష్ణ మీడియాకు చెప్పారు.
ఎన్టీఆర్ కేవలం సినీ నటుడే అయితే బహుశః తెలంగాణ సమాజం కూడా ఆయన విగ్రహం ఏర్పాటుకి అభ్యంతరం చెప్పక పోవచ్చు. కానీ ఆయన టీడీపీతో రాజకీయాలలో ప్రవేశించి ముఖ్యమంత్రిగా కూడా చేశారు. కనుక తెలంగాణ సమాజం ఆయనని ఆంధ్రాకు చెందిన రాజకీయ నాయకుడుగానే చూస్తుంటుంది.
తెలంగాణ ఉద్యమాలు, ఆ తర్వాత పదేళ్ళ కేసీఆర్ పాలనలో తెలంగాణ సెంటిమెంట్ చాలా బలపడింది. కనుక ఆంధ్రాకు చెందిన దేనినైనా వ్యతిరేకించడం పరిపాటిగా మారింది.
టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారనే వాదనలు నేటికీ వినిపిస్తుంటాయి. ఇప్పటికే హైడ్రా, తెలంగాణ తల్లి వంటి పలు వివాదస్పద నిర్ణయాలతో విమర్శల పాలవుతున్న సిఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఈ నిర్ణయంతో మరో కొత్త వివాదం సృష్టించుకున్నట్లే అవుతుంది.
తెలంగాణ తల్లి విగ్రహం విషయంలోనే తెలంగాణ సమాజం ఏమనుకుంటుందో తెలీదు. ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది తప్పని భావిస్తే గ్రేటర్ ఎన్నికలలో ఆ తీర్పు వస్తుంది. మరి ఇప్పుడు గ్రేటర్ లెక్కలు దృష్టిలో ఉంచుకొని సిఎం రేవంత్ రెడ్డి అడుగు ముందుకు వేస్తే, ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుని తెలంగాణ సమాజం అంగీకరించకపోతే రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నష్టపోయే ప్రమాదం ఉంటుంది.