హైడ్రా కమీషనర్ రంగనాధ్ ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “హైడ్రా ఏర్పాటుకు ముందు నిర్మించుకున్న ఇళ్ళ జోలికి వెళ్ళవద్దని ప్రభుత్వం ఆదేశించింది. కనుక వాటికి అనుమతులున్నా లేకపోయినా ఇకపై వాటిని ముట్టుకోము. కనుక పుకార్లు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. కానీ ఇకపై హైడ్రా పరిధిలో కొత్తగా నిర్మించే భవనాలన్నీ తప్పనిసరిగా బఫర్ జోన్ నిబంధనలకు లోబడి ఉండాలి. విరుద్దంగా నిర్మిస్తున్నట్లయితే వాటిని కూల్చేస్తాము,” అని చెప్పారు.
నగరంలో వేలాది ఇళ్ళు కూల్చేసి వాటిలో నివసిస్తున్న నిరుపేదలను రోడ్డున పడేసిన తర్వాత ఇకపై కూల్చమని చెప్పడం అంటే ఇంత వరకు చేసింది తప్పే అని ఒప్పుకుంటున్నట్లే కదా? హైడ్రా కూల్చివేతలతో ప్రజలు ఇళ్ళు మాత్రమే కోల్పోలేదు. పలుచోట్ల వారి జీవనాధారమైన టిఫిన్ సెంటర్స్ వంటివి సైతం కోల్పోయారు.
ఇళ్ళు, ఆదాయ మార్గం కోల్పోయిన ఆ అభాగ్యులను ప్రభుత్వం, హైడ్రా, ప్రతిపక్షాలు కూడా పట్టించుకోవడం లేదిప్పుడు. కానీ చెరువు స్థలాన్ని కబ్జా చేసి కాలేజీ భవనాలు నిర్మించుకున్న మల్లారెడ్డి, ఓవైసీ వంటి వారికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా హైడ్రాకు బ్రేకులు వేసి నిలిపేసింది.
హైడ్రా వలన సామాన్య ప్రజలు మాత్రమే కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నష్టపోవడం ఖాయమే. ఇళ్ళు, జీవనోపాధి కోల్పోయిన ఆ అభాగ్యులు అందరూ గ్రేటర్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేయకుండా ఉంటారా? అంటే కాదనే అర్దమవుతుంది. కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు.