అల్లు అర్జున్ ఈరోజు ఉదయం జైలు నుంచి ఇంటికి చేరుకున్న నుంచి టాలీవుడ్‌లో సినీ ప్రముఖులు జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి క్యూ కట్టారు. ఇటువంటి సమయంలో వారు వచ్చి అల్లు అర్జున్‌కి సంఘీభావం తెలుపడం చాలా మంచిదే.. అవసరం కూడా.
అల్లు అర్జున్ తండ్రి అల్లు అర్వింద్ పెద్ద నిర్మాత, గీతా ఆర్ట్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థకు యజమాని. ఆయన అనేకమంది దర్శకులు, నటీనటులతో సినిమాలు తీస్తుంటారు. పైగా అందరితో చక్కటి స్నేహాసంబంధాలు కలిగి ఉన్నారు. అల్లు అర్జున్ గురించి చెప్పక్కరలేదు.
పుష్ప-2తో జాతీయస్థాయికి ఎదిగిపోయారు. అల్లు అర్జున్‌తో ఒక్క సినిమా చేసినా దర్శక, నిర్మాతలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అదో పెద్ద సర్టిఫికేట్‌లా మరిన్ని సినిమా అవకాశాలు కల్పిస్తుంది.
కనుకనే అందరూ అల్లు అర్జున్ ఇంటికి క్యూ కడుతున్నారని అనుకోవచ్చు లేదా అల్లు అర్జున్ అరెస్టుని తెలంగాణ ప్రభుత్వం తామందరికీ ఇచ్చిన వార్నింగ్‌గా భావించి, అందరం కలిసికట్టుగా ఉన్నామని ప్రభుత్వానికి సందేశం పంపేందుకు వచ్చి ఉండవచ్చు. కారణం ఏదైనప్పటికీ అల్లు అర్జున్ వెంట యావత్ టాలీవుడ్ నిలబడిందని స్పష్టమైంది.
కానీ సినీ పరిశ్రమలో సీనియర్ నటుడైన మోహన్ బాబు కూడా అనేక సమస్యలలో చిక్కుకొని, ఆస్పత్రిలో చేరినా టాలీవుడ్‌లో ఏ ఒక్కరూ కూడా వెళ్ళి ఆయనని పరామర్శించలేదు. కనీసం ఆయనకు సంఘీభావం తెలుపుతూ సోషల్ మీడియాలో చిన్న సందేశం కూడా పెట్టకపోవడం చూస్తే టాలీవుడ్ మంచు కుటుంబాన్ని వెలి వేసిందా? అనిపిస్తుంది.
ఇందుకు టాలీవుడ్‌కి అనేక కారణాలు ఉండి ఉండవచ్చు కానీ మోహన్ బాబు వంటి సీనియర్ నటుడు ఇబ్బంది పడుతున్నప్పుడు వెళ్ళి పరామర్శించి ధైర్యం చెప్పడం కనీస మర్యాద. వీలైతే టాలీవుడ్ పెద్దలు చొరవ తీసుకొని ఆయనని ఆ సమస్యలలో నుంచి బయటపడేసేందుకు ప్రయత్నించాలి. కానీ అందరూ ఆయనని వెలివేసిన్నట్లు వ్యవహరిస్తుండటం చాలా బాధాకరం.