అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై సిఎం రేవంత్ ఏమన్నారంటే..

December 14, 2024


img

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు, ప్రజాదరణ సంపాదించుకున్న అల్లు అర్జున్‌ వంటి ప్రముఖ నటుడుని తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్‌ చేయించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.

రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తున్న అల్లు అర్జున్‌ పట్ల ప్రభుత్వం ఇంత దారుణంగా ప్రవర్తించడాన్ని తప్పు పడుతున్నారు.

అసలు అల్లు అర్జున్‌ అరెస్ట్‌ విషయం సిఎం రేవంత్ రెడ్డికి తెలుసా తెలియదా? తెలిస్తే ఆయన అనుమతితోనే అరెస్ట్‌ చేశారా? అంటూ అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసలు తెలంగాణ ప్రభుత్వం ఈవిదంగా ఎందుకు వ్యవహరించింది? అని అందరూ ప్రశ్నిస్తున్నారు. 

ఈ ప్రశ్నలన్నిటికీ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే సమాధానం చెప్పారు. నిన్న సాయంత్రం ఢిల్లీలో ప్రముఖ జాతీయ న్యూస్ ఛానల్ ‘ఆజ్ తక్’ ఇంటర్వ్యూలో పాల్గొనప్పుడు ఇవే ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి సిఎం రేవంత్ రెడ్డి కూడా డొంక తిరుగుడు లేకుండా చాలా సూటిగానే సమాధానం చెప్పారు. 

ఇప్పుడు మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నవారికి పుష్ప-2 సినిమా విడుదలవుతున్నప్పుడు ముందుగా టికెట్ ఛార్జిలు అదనంగా మరో రూ.800లు పెంచుకునేందుకు మా ప్రభుత్వమే అనుమతించిందనే విషయం గుర్తులేదా?

అల్లు అర్జున్‌ మేనమామ చిరంజీవి, మామ చంద్రశేఖర రెడ్డి ఇద్దరూ మా పార్టీ నేతలే. చంద్రశేఖర రెడ్డి కుటుంబం మాకు బంధువులు కూడా. అటువంటప్పుడు అల్లు అర్జున్‌ని బలమైన కారణం ఏదీ లేకుండానే మేము అరెస్ట్‌ చేస్తామా?

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఓ ముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత నాకుంటుంది. ఒకవేళ చేయకపోతే అప్పుడూ అందరూ నన్నే విమర్శిస్తారు.

అవతలి వ్యక్తి సినిమా స్టారా.. పొలిటికల్ స్టారా?అని చూసి అరెస్టులు చేయము. నేరాన్ని బట్టే నిర్ణయాలు ఉంటాయి.

అల్లు అర్జున్‌ సినిమా హడావుడి చేయకుండా సినిమా చూసి వెళ్ళిపోతే తొక్కిసలాట జరిగేదీ కాదు. ఆ మహిళా చనిపోయేదీ కాదు కదా? కనుక ఆమె మృతికి ఆయన కూడా కారకుడే కదా? అందుకే చట్ట ప్రకారం పోలీసులు చర్యలు తీసుకున్నారు.

ఈ కేసులో అల్లు అర్జున్‌ ఒక్కరినే అరెస్ట్‌ చేయలేదు. మరో పది మందిని అరెస్ట్‌ చేశారు. ఏ ఏకేసులో అల్లు అర్జున్‌ని ఏ-11గా పేర్కొన్నారు. 

అల్లు అర్జున్‌ పెద్ద హీరో.. వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు చేస్తూ డబ్బు సంపాదించుకుంటున్నారే తప్ప భారత్‌-పాకిస్తాన్ సరిహద్దు వద్ద యుద్ధం చేయడం లేదు కదా? గతంలో సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ వంటి పెద్ద నటులని పోలీసులు అరెస్ట్‌ చేశారు కదా? ఆదేవిదంగా అల్లు అర్జున్‌ని కూడా అరెస్ట్‌ అయ్యారని ఎందుకు అనుకోవడం లేదు?

ఆయనకు హైకోర్టు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది కదా? అంతా చట్టప్రకారమే జరుగుతున్నప్పుడు అందరూ ఎందుకు ఇంతగా స్పందిస్తున్నారు?” అని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.


Related Post