ఒకరి కష్టం మరొకరికి ఉపశమనం కలిగించవచ్చు అంటే నమ్మశక్యంగా ఉండదు. కానీ అల్లు అర్జున్ అరెస్ట్‌తో మంచు మోహన్ బాబు కుటుంబానికి మీడియా నుంచి పూర్తి ఉపశమనం లభిస్తుందంటే నిజమే కదా? అనిపిస్తుంది.
గత వారం రోజులుగా మీడియా ప్రతినిధులు జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి వద్ద తిష్టవేసి వారి గొడవలకు లైవ్ కవరేజ్ ఇస్తున్నారు. మంచు కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళితే అక్కడికి మీడియా వెళ్ళి వారితో మాట్లాడిస్తోంది. ఈ గొడవలు,కేసులతో మోహన్ బాబు దశాబ్ధాల కృషితో సంపాదించుకున్న పరువు ప్రతిష్టలు గంగలో కలిసిపోయాయి. పైగా హత్యాయత్నం కేసులో చిక్కుకున్నారు కూడా.
అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అవడంతో యావత్ మీడియా ఇప్పుడు దానిపైకి మళ్ళింది. అల్లు అర్జున్ అరెస్ట్, సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట, మహిళా మృతి, ప్రత్యక్ష సాక్షుల కధనాలు, చిక్కడపల్లి, గాంధీ ఆస్పత్రి వద్ద పోలీసుల మోహరింపు, అభిమానుల ఆందోళనలు, కోర్టు కేసు, ప్రక్రియల గురించి ఎప్పటికప్పుడు వేడివేడిగా వార్తలు వడ్డించేస్తున్నారు మీడియా ప్రతినిధులు.
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు నిర్మాత దిల్ రాజు, మెగాస్టార్ చిరంజీవి, ఇంకా పలువురు సినీ ప్రముఖులు తరలి వస్తుండటంతో మీడియాకు సంపూర్ణమైన భోజనం లభించిన్నట్లే. ఇక మీడియా ఫోకస్ అంతా ఈ కేసుపైనే ఉంటుంది కనుక మోహన్ బాబు కుటుంబానికి మీడియా నుంచి విముక్తి లభించిన్నట్లే!