పుష్ప-2లో పోలీసులను, రాజకీయ నాయకులను గడగడలాడించిన పుష్పరాజ్, నిజజీవితంలో మాత్రం జైలుకి వెళ్ళక తప్పేలా లేదు. చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌కి గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారు. న్యాయస్థానం అల్లు అర్జున్‌కు 2 వారాలు జ్యూడిషియల్ రిమాండ్ విధించవచ్చు.
అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు వెంటనే బెయిల్ దరఖాస్తు సమర్పిస్తే, న్యాయమూర్తి దానిని ఆమోదించవచ్చు లేదా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినందున తిరస్కరించవచ్చు.
అల్లు అర్జున్‌పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన మర్నాడే ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.
కానీ అది ఇంతవరకు విచారణకు రాకపోవడంతో ఆయన తరపు న్యాయవాదులు నేడు న్యాయమూర్తిని కలిసి లంచ్ మోషన్ పిటిషన్‌గా పరిగణించి విచారించాలని అభ్యర్ధించారు. కానీ ఇదేమీ అత్యవసరం పిటిషన్ కాదని సోమవారమే విచారణ చేపడతామని తేల్చి చెప్పేశారు.
కనుక ఒకవేళ నేడు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌కి బెయిల్ లభించకపోతే సోమవారం లేదా బెయిల్ లభించేవరకు జైల్లో గడపక తప్పదు.
జాతీయ అవార్డు గ్రహీత అయిన అల్లు అర్జున్‌ని అరెస్ట్‌పై విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరుని ఖండిస్తున్నామని బిఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. అల్లు అర్జున్ అరెస్ట్‌పై బిఆర్ఎస్ పార్టీ ఏమందంటే..
అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును.. చేసిన అతిని ఖండిస్తున్నాను : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS.
జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ అల్లు అర్జున్ అరెస్టు పాలకుల అభద్రతాభావానికి తార్కాణం తొక్కిసలాట బాధితుల పట్ల నాకు పూర్తి సానుభూతి ఉంది, కానీ అసలు తప్పు ఎవరిది?నేరుగా ఆయనకు సంబంధం లేని అంశంలో అల్లు అర్జున్ గారిని సాధారణ నేరస్తుడిలా పరిగణించడం సరైంది కాదు.
సంబంధం లేని అంశంలో అల్లు అర్జున్ అరెస్టు చేయడం న్యాయమైతే... హైడ్రా పేరుతో పేద ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వారి మరణానికి కారణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలి.