తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో సిఎం రేవంత్ రెడ్డి చాలా లౌక్యంగా వ్యవహరించారని చెప్పక తప్పదు. తమ అధినేత్రి సోనియా గాంధీ పుట్టిన రోజునాడే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ముహూర్తం పెట్టడమే కాకుండా, ఇకపై ఏటా అదే రోజున తెలంగాణ తల్లి దినోత్సవం జరిపిస్తామని ప్రకటించారు.
తెలంగాణ తల్లి విగ్రహం, రూపు రేఖల విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారని, ఉంటారని అనుకోలేము. పైగా ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదని, కాంగ్రెస్ తల్లి అంటే సోనియా గాంధీకి ప్రతిరూపమే అని బిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా గట్టిగా వాదిస్తుండటం అందరూ వింటూనే ఉన్నారు కదా? కనుక ఈ విగ్రహాన్ని, ఈ కార్యక్రమాన్ని సోనియా గాంధీతో ఆమె పుట్టిన రోజుతో ముడిపెట్టి జరుపుతుండటం వలన పార్టీలో ఎవరూ సిఎం రేవంత్ రెడ్డిని వ్యతిరేకించలేని పరిస్థితి కల్పించారని చెప్పొచ్చు.
ఇక కేసీఆర్ రూపొందించి ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహానికి పూర్తి భిన్నంగా సాధారణ స్త్రీమూర్తిగా విగ్రహాన్ని రూపొందింపజేసి తెలంగాణలో ప్రతీ మహిళా కొత్త విగ్రహంతో మమేకం అయ్యేలా చేయగలిగారని చెప్పొచ్చు. కానీ బిఆర్ఎస్ పార్టీ దానిని అంగీకరించదు. కనుక తీవ్రంగా వ్యతిరేకించేలా చేశారు.
తద్వారా తెలంగాణ తల్లి విగ్రహాన్ని బిఆర్ఎస్ పార్టీ, నేతలు వ్యతిరేకిస్తున్నారని వారి నోటితోనే చెప్పేలా చేశారు. కనుక రేవంత్ రెడ్డి ఒక్క దెబ్బకు రెండు దెబ్బలు కొట్టారని చెప్పొచ్చు. కానీ రాష్ట్ర ప్రజలు ఈ కొత్త తల్లిని స్వీకరిస్తారా లేదా? అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. వారు స్వీకరించేలా చేయడం రేవంత్ రెడ్డి బాధ్యత. చేయగలిగితే ఇక ఆయనకి తిరుగు ఉండదు. లేకుంటే పార్టీలో ఇబ్బందులు మొదలయ్యే అవకాశం ఉంటుంది.