కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని గెలిపించినప్పుడు ‘నాన్నకు ప్రేమతో...‘ కొడుకు కానుక అని మీడియా అభివర్ణించింది. ఆ తర్వాత ఆయన కూడా ‘కొడుకుకి ప్రేమతో’ మరికొన్ని శాఖలు అప్పగించారు.
ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ‘అన్నకు ప్రేమతో..’ నాగబాబుకి మంత్రి పదవి దక్కేలా చేశారు. ఈ మేరకు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు నిన్న అధికారికంగా ప్రకటించారు.
ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరారని కానీ ఇప్పటికే ఆ మూడు సీట్లు వేరేవారికి ఇస్తామని మాట ఇచ్చేసినందున, నాగబాబుని మంత్రివర్గంలో తీసుకోవాలని నిర్ణయించిన్నట్లు చంద్రబాబు నాయుడు చెప్పారు.
నాగబాబు ఈ ఏడాది మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అనకాపల్లి నుంచి జనసేన అభ్యర్ధిగా పోటీ చేద్దామనుకున్నారు. కానీ పొత్తులలో భాగంగా ఆ సీటుని బీజేపి కోసం త్యాగం చేయాల్సి వచ్చింది. కనుక రాజ్యసభ సీటు లభిస్తుందని అనుకున్నారు.
కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకపోయినా ఏకంగా మంత్రి పదవే లభించింది.
ఇప్పడు ఏపీ మంత్రివర్గంలో, శాసనసభలో అన్నదమ్ములిద్దరూ కనిపిస్తుంటారు. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. కానీ తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేనతో ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పదవులు చేపట్టడమే కాకుండా ఇప్పుడు అన్న నాగబాబుకి కూడా మంత్రి పదవి ఇప్పించుకున్నారు.