రేపు (సోమవారం) నుంచి తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కనుక బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు తన ఫామ్‌హౌస్‌లో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు.
రేపే సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరుగబోతోంది. తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చడాన్ని బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది కనుక ఈ శాసనసభలో అంశంపై చాలా వాడివేడిగా చర్చ జరుగవచ్చు.
అలాగే హైడ్రా కూల్చివేతలు, ఎన్నికల హామీల అమలు, దళితబంధు తదితర అంశాలపై బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయవచ్చు. కానీ కేసీఆర్ రేపు శాసనసభకు రాన్నట్లయితే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ సభ్యుల ముందు మళ్ళీ తలదించుకోక తప్పదు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుని ఘనంగా విజయోత్సవాలు నిర్వహించుకుంది కనుక సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అదే ఉత్సాహంతో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ధీటుగా ఎదుర్కోవడం ఖాయమే. సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పోటీలు పడుతూ తమ ఏడాది పాలన గురించి గొప్పగా చెప్పుకోకుండా ఉండరు.
విద్యుత్ కొనుగోలు ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్స్ నిర్మాణంలో బిఆర్ఎస్ ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ తదితర అంశాలను ప్రస్తావిస్తూ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను నిలువరించే ప్రయత్నం చేయవచ్చు. కనుక ఈసారి కూడా శాసనసభ సమావేశాలు చాలా వాడీవేడిగా సాగే అవకాశం ఉంది.