సాధారణ స్త్రీమూర్తిగా తెలంగాణ తల్లి

December 06, 2024


img

ఈ నెల 9న సచివాలయం ఆవరణలో సిఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇదివరకు కేసీఆర్‌ హయంలో రూపొందించి తెలంగాణ తల్లికి పూర్తి భిన్నంగా ఇది ఉంటుందని అందరికీ తెలుసు కానీ ఆమె రూపు రేఖలు ఏవిదంగా ఉండబోతున్నాయనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.

ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కాంక్రీట్ దిమ్మ మీదకు చేర్చారు. ఆ తర్వాత మెల్లగా ఆమె రూపు రేఖలు ఏవిదంగా ఉంటాయో తెలియజేస్తూ కొందరు సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టారు. 

ఇదివరకు విగ్రహం నెత్తిపై బంగారు కిరీటం, బంగారు ఆభరణాలతో దేవతా మూర్తిని తలపిస్తుండేది. కుడి చేతిలో వరి కంకులు, ఎడమ చేతిలో బతుకమ్మతో నిండుగా కనిపిస్తుంది. 

కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం 9న ఆవిష్కరించబోయే తెలంగాణ తల్లి విగ్రహం సాధారణ స్త్రీమూర్తిగా నిరాడంబరంగా ఉంది. ఎడమ చేతిలో వరి కంకులు పట్టుకొని కుడిచేత్తో ఆశీర్వదిస్తుంటుంది.  

పాత విగ్రహం ఎరుపు చీరతో ఉండగా కొత్త విగ్రహం పచ్చటి చీరలో నిండుగా ఉంది. పాత విగ్రహంలో రెండు చేతులకి బంగారు గాజులు ధరించిన్నట్లు ఉండగా కొత్త విగ్రహం చేతులకి గాజు గాజులు ధరించిన్నట్లు చూపారు. 

ఉద్యమాలతో సాధించిన తెలంగాణకు ఆమె తల్లి కనుక దిగువన నీలి రంగు పీఠం దాని చుట్టూ బిగించిన పిడికిళ్ళు పెట్టారు. 

అయితే తాము ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో ఎటువంటి మార్పులు చేసినా తాము అంగీకరించమని, తాము అధికారంలోకి రాగానే కొత్త విగ్రహం తొలగించి దాని స్థానంలో మళ్ళీ పాత విగ్రహం ఏర్పాటు చేస్తామని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్‌ ఈరోజే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కనుక ఇప్పుడు ఇదో పెద్ద వివాదంగా మారబోతోంది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలవుతుంది. ప్రజాభిప్రాయం ఏవిదంగా ఉందో?


Related Post